అలా చేస్తే బుమ్రాకు మ‌ళ్లీ గాయం కావొచ్చు.. గ్లెన్‌ మెక్ గ్రాత్ కీల‌క సూచ‌న‌!

  • వెన్నునొప్పి గాయంతో 11 నెల‌ల పాటు క్రికెట్‌కు దూర‌మైన భార‌త స్టార్ పేస‌ర్
  • విరామం లేకుండా ఆడితే బుమ్రా మ‌ళ్లీ గాయం బారినప‌డే అవ‌కాశం ఉందన్న మెక్ గ్రాత్ 
  • బుమ్రా బౌలింగ్ యాక్ష‌న్ కార‌ణంగానే శ‌రీరంపై అధిక ఒత్తిడి ప‌డుతుంద‌న్న ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గ‌జం
  • ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేష‌న్ వ‌ద్ద మాట్లాడిన మెక్ గ్రాత్
వెన్నునొప్పి గాయం కార‌ణంగా భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ఏకంగా 11 నెల‌ల పాటు క్రికెట్‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే. గ‌తేడాది స్వ‌దేశంలో జ‌రిగిన్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు కొన్ని రోజుల ముందు గాయం నుంచి కోలుకున్నాడు. ఆ త‌ర్వాత ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లోనూ పాల్గొన్నాడు. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడాడు. ఈ నాలుగు టెస్టుల్లో క‌లిపి 100 ఓవ‌ర్ల వ‌ర‌కు బౌలింగ్ చేశాడు. ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గ‌జం గ్లెన్ మెక్ గ్రాత్ తాజాగా బుమ్రాకు కీల‌క స‌ల‌హా ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో టెస్టుల అనంత‌రం బుమ్రా వ‌రుస‌గా మూడు నెల‌ల పాటు క్రికెట్ ఆడాల్సి ఉంది. ఐపీఎల్ టోర్నీ, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఇలా తీరిక‌లేకుండా క్రికెట్‌ ఆడాలి.  అయితే, ఇలా విరామం లేకుండా క్రికెట్ ఆడితే బుమ్రా మ‌రోసారి గాయం బారిన‌ప‌డే అవ‌కాశం ఉంద‌న్నాడు మెక్ గ్రాత్‌. మ‌ధ్య‌లో కొంత విరామం తీసుకుంటే మంచిద‌ని సూచించాడు. 

ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేష‌న్ వ‌ద్ద మెక్ గ్రాత్‌ మాట్లాడుతూ.. "బుమ్రా బౌలింగ్ యాక్ష‌న్ కార‌ణంగానే అతని శ‌రీరంపై ఎక్కువ ఒత్తిడి పడుతోంది. అత‌డు త‌క్కువ ర‌న్ఆప్‌తో ఎక్కువ స్పీడ్‌తో బౌలింగ్ చేస్తుంటాడు. అలాగే బౌలింగ్ స‌మ‌యంలో అత‌డి బాడీ శైలి కూడా ప్ర‌త్యేకంగా ఉంటుంది. ప్ర‌తి బంతిని ఎంతో బలంగా విసురుతాడు. దీనికోసం అత‌డు త‌న శ‌రీరాన్ని ఎంతో ఒత్తిడికి గురి చేస్తుంటాడు. ఇలా అధిక‌ శ‌రీర శ్ర‌మ‌తో విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడితే క‌చ్చితంగా గాయం అవుతుంది. ఇలా గ‌తంలో కూడా బుమ్రాకు జ‌రిగింది. అందుకే మ‌ధ్య‌లో కొంత విరామం తీసుకుని ఆడితే మంచిది" అని మెక్ గ్రాత్ చెప్పుకొచ్చాడు. 

ఇక బుమ్రా వెన్నునొప్పి కార‌ణంగా గ‌తేడాది ఐపీఎల్ సీజ‌న్‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే. అయితే, ఈసారి ముంబై ఇండియ‌న్స్‌కు బుమ్రా కీల‌కం కానున్నాడు. గ‌త సీజ‌న్‌లో బుమ్రా లేక‌పోవ‌డంతో ముంబై బౌలింగ్ విష‌యంలో తీవ్రంగానే ఇబ్బంది ప‌డింది. బుమ్రా స్థానంలో వ‌చ్చిన ఆకాశ్ మ‌ధ్వాల్ కొంత‌మేర ఆ జ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డ్డాడు. ఈ సీజ‌న్‌లో జ‌స్ప్రీత్ బుమ్రా చేరిక‌తో ముంబై ఇండియ‌న్స్ బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారుతుంది.


More Telugu News