27 వరకు నామినేషన్లు.. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు విడుదలైన నోటిఫికేషన్

  • మార్చి 27 వరకు నామినేషన్ల సమర్పణకు అవకాశం
  • మార్చి 28న పరిశీలన.. 30వ వరకు ఉపసంహరణకు ఛాన్స్
  • రాష్ట్రపతి తరపున నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ పత్రాల సమర్పణకు మార్చి 27 చివరి తేదీగా ఉంది. అయితే బీహార్‌లో 27న పండుగ ఉండడంతో 28 వరకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. మార్చి 28 నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని, బీహార్‌లో మార్చి 30న పరిశీలన ఉంటుందని వివరించింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 30 అని, బీహార్‌లో ఏప్రిల్ 2 వరకు అవకాశం ఉంటుందని వివరించింది. ఈ నోటిఫికేషన్‌తో లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల ప్రక్రియ మొదలైంది.

కాగా ఈ నోటిఫికేషన్‌తో దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. అత్యధికంగా తమిళనాడులో 39 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 2 సీట్ల చొప్పున, ఛత్తీస్‌గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది.

కాగా ఏప్రిల్ 19న మొదటి దశ.. కాగా ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీలలో తదుపరి దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.


More Telugu News