కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్

  • కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 
  • కాకినాడ నుంచి ఉదయ్ ని, పిఠాపురం నుంచి తనను గెలిపించాలన్న పవన్
  • తన అభిమాన బలం మొత్తం పిఠాపురం తీసుకువచ్చి చూపిస్తానని వెల్లడి
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థిని ప్రకటించారు. కాకినాడ ఎంపీ స్థానం కోసం జనసేన తరఫున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో దిగుతున్నాడని పవన్ వెల్లడించారు.

ఇవాళ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోనే పవన్ కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. 

టీడీపీ-బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఈసారి ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్... ఈసారి పిఠాపురంలో తన గెలుపును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 

రాష్ట్రంలో తాను అనుకున్న మార్పును ముందుగా పిఠాపురంలో చేసి చూపిస్తానని అన్నారు. దేశంలో అందరి దృష్టి పిఠాపురంపై పడేలా చేస్తానని పేర్కొన్నారు. 

"నా అభిమాన బలాన్ని పిఠాపురం తీసుకువచ్చి చూపిస్తా... జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే నా సొంత నిధులు ఖర్చు చేస్తాను. పిఠాపురం కోసం అవసరమైతే ఎక్కడ్నించైనా నిధులు తీసుకువచ్చి చూపిస్తాను" అని ఉద్ఘాటించారు. వ్యవసాయానికి అండగా ఉంటాను, పట్టు రైతులు కోరుకున్నట్టు మార్కెట్ ఏర్పాటు చేస్తాను, ఉప్పాడ చీరలకు ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను తీసుకువస్తాను అని వివరించారు. 

10 ఏళ్ల ప్రజా పోరాటం తర్వాత అడుగుతున్నాను... కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ ని, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గట్టి మెజారిటీతో గెలిపించండి అని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.


More Telugu News