2026 నాటికి భారత్ లో బుల్లెట్ రైలు పరుగులు

  • భారత్ లో 508.17 కి.మీ మేర బుల్లెట్ రైలు కారిడార్
  • 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయికి! 
  • తొలుత సూరత్ నుంచి బిలిమోరా వరకు బుల్లెట్ రైలు
జపాన్, చైనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ప్రజా రవాణా కోసం బుల్లెట్ రైళ్ల వంటి అత్యాధునిక రైళ్లను ఉపయోగిస్తుంటారు. గత కొన్ని దశాబ్దాలుగా బుల్లెట్ రైళ్లు వేగానికి పర్యాయపదంగా నిలుస్తున్నాయి. భారత్ లోనూ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాలన్నది ఏళ్ల తరబడి వినిపిస్తున్న ప్రతిపాదన.

దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. 2026 నాటికి భారత్ లో తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల్లో బుల్లెట్ రైలు కోసం 500 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ ను నిర్మించడానికి 20 ఏళ్లు పట్టిందని, భారత్ ఈ ట్రాక్ ను 8 నుంచి 10 ఏళ్లలోనే పూర్తి చేయనుందని తెలిపారు. 

మొదటి బుల్లెట్ రైలు సూరత్ నుంచి బిలిమోరా మధ్య నడుస్తుందని వివరించారు. భారత్ లో మొదటి బుల్లెట్ రైలు కారిడార్ ను 508.17 కి.మీ మేర నిర్మిస్తున్నామని, దీని ద్వారా అహ్మదాబాద్ నుంచి ముంబయికి కేవలం 2 గంటల 58 నిమిషాల్లో చేరుకోవచ్చని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 

బుల్లెట్ రైళ్లు గరిష్ఠంగా గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళతాయి. ప్రస్తుతం భారత్ లో వేగవంతమైన రైలు వందేభారత్. ఇది గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో పయనిస్తుంది.


More Telugu News