రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకున్న శ్రీలంక స్టార్ క్రికెట‌ర్‌

  • వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టిపెట్టేంద‌కు గ‌తేడాది టెస్టులకు గుడ్‌బై చెప్పిన స్పిన్న‌ర్ వనిందు హ‌స‌రంగా 
  • బోర్డు సూచ‌న‌తో నిర్ణ‌యం మార్చుకున్న బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్‌
  • బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌కు లంక జ‌ట్టుకు ఎంపిక‌
శ్రీలంక స్పిన్న‌ర్ వ‌నిందు హ‌స‌రంగా త‌న రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టిపెట్టేంద‌కు ఈ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్‌ గ‌తేడాది టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అయితే, తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు సూచ‌న మేర‌కు త‌న నిర్ణ‌యం మార్చుకున్నాడు. ఐసీసీ టెస్టు ఛాంపియ‌న్‌షిప్‌లో భాగంగా ఈ నెల 22 నుంచి బంగ్లాదేశ్‌తో జ‌రిగే రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌కు లంక జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. 

కాగా, హ‌స‌రంగా 2020లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం నాలుగు టెస్టులు మాత్ర‌మే ఆడాడు. ఏడు ఇన్నింగ్స్‌ల‌లో ఒక హాఫ్ సెంచ‌రీ  సాయంతో 196 ప‌రుగుల‌తో పాటు నాలుగు వికెట్లు తీశాడు. ఇక ఇప్ప‌టికే శ్రీలంక టెస్టు జ‌ట్టులో ప్ర‌బాత్ జ‌య‌సూర్య‌, ర‌మేష్ మెండీస్ వంటి నాణ్య‌మైన స్పిన్న‌ర్లు ఉన్నారు. హ‌స‌రంగా చేరిక‌తో జ‌ట్టు స్పిన్ విభాగం మ‌రింత పటిష్ఠంగా మారుతుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ఫిబ్ర‌వరిలో శ్రీలంక క్రికెట్ బోర్డు జ‌ట్టుకు ధ‌నుంజ‌య డి సిల్వాను కొత్త కెప్టెన్‌గా నియ‌మించిన విష‌యం తెలిసిందే.  

ఇక‌ ఐపీఎల్‌లో హ‌స‌రంగా హైద‌ర‌బాద్ స‌న్ రైజ‌ర్స్ (ఎస్ఆర్‌హెచ్) కు ఆడుతున్నాడు. కానీ, బంగ్లాతో టెస్టు సిరీస్ కార‌ణంగా అత‌డు ఎస్ఆర్‌హెచ్ ఆడే తొలి మూడు మ్యాచుల‌కు అందుబాటులో ఉండ‌డ‌ని స‌మాచారం.


More Telugu News