రాష్ట్రంలో పాతతరం రాజకీయాలు రావాలి: లోకేశ్

  • ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే అందరూ దృష్టి సారించాలన్న లోకేశ్ 
  • విమర్శలు విధానపరంగా మాత్రమే ఉండాలన్న యువనేత
  • మంగళగిరిలో ‘బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్’ కార్యక్రమంలో వ్యాఖ్యలు
‘పాతతరం రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండేవి.. ఎన్నికల తర్వాత అధికార ప్రతిపక్ష నేతల దృష్టి అభివృద్ధిపైనే ఉండేది. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు ఇలాంటి రాజకీయమే కావాలి. పాత తరం రాజకీయం రావాలి’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో మంగళవారం నిర్వహించిన ‘బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్’ కార్యక్రమంలో అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ వాసులను లోకేశ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. 

గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లాంటివారు ముఖ్యమంత్రులుగా ఉన్నపుడు విమర్శలు కేవలం విధానపరంగా మాత్రమే ఉండేవని, రాజకీయాలు హుందాగా ఉండేవని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో హుందాతనం పూర్తిగా నశించిందని ఆరోపించారు. వ్యక్తిగత, విద్వేషపూరిత వ్యాఖ్యలతో రాజకీయ నేతలు ముఖాముఖాలు చూసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. రాజకీయాల్లో ఇది వాంఛనీయం కాదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. విధ్వంసం, కక్ష సాధింపు, డబ్బుతోనే రాజకీయాలు సాధ్యంకాదన్న విషయం గమనించాలని జగన్ కు హితవు పలికారు.

అంతులేని సంపద ఉన్నా ఎన్నికల్లో పార్టీని గెలిపించలేదనే విషయం ఇతర రాష్ట్రాల్లోని పార్టీలను చూసి తెలుసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో తగిన ఎకోసిస్టమ్ ను ఏర్పాటు చేస్తేనే పరిశ్రమలు తరలివస్తాయని, హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిందంటే దానికి చంద్రబాబు ముందుచూపుతో ఏర్పాటు చేసిన వాతావరణమేనని లోకేశ్ పేర్కొన్నారు. అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటువల్ల అక్కడి ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో సెల్ ఫోన్ తయారీ పరిశ్రమను చంద్రబాబు అభివృద్ధి చేశారని చెప్పారు.

అప్పులు చేయడం ఏ ప్రభుత్వానికైనా సహజమేనని, అభివృద్ధిలో ముందంజలో ఉన్న సింగపూర్, అమెరికా, చైనా, యూరప్ దేశాలు కూడా అప్పులు చేస్తాయని లోకేశ్ వివరించారు. అయితే, తెచ్చిన అప్పులను మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించడం వల్ల ఆయా దేశాల్లో సంపద వృద్ధిచెందిందని, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఆస్కారం ఏర్పడిందని వివరించారు. తెచ్చిన అప్పులను సద్వినియోగం చేయకుంటే ఏం జరుగుతుందనే దానికి ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితే చక్కటి ఉదాహరణ అని లోకేశ్ పేర్కొన్నారు.

ఆంధ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా, అనివార్యంగా జరిగిన రాష్ట్ర విభజనతో కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చిందని లోకేశ్ చెప్పారు. అయినప్పటికీ రేయింబవళ్లు శ్రమించి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో పోటీపడి చంద్రబాబు ఏపీకి పరిశ్రమలు తెచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారని చెప్పారు. అన్నివిధాలా ఆలోచించి, 5 కోట్లమందిని ఒప్పించి అమరావతిని రాజధానిగా నిర్ణయించారని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో చంద్రబాబు చేసి చూపించారని తెలిపారు.

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా మూడు రాజధానులు లేవని లోకేశ్ అన్నారు. అవగాహన , అనుభవంలేని జగన్ మూడుముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు కానీ విశాఖలో ఆయన 550 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ పార్టీ విధానమని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన రాజధాని పనులు ప్రారంభిస్తామని లోకేశ్ ఈ సందర్భంగా అమరావతి వాసులకు హామీ ఇచ్చారు.


More Telugu News