ట్రెండింగ్‌లో 'RIP హార్దిక్ పాండ్యా'.. రోహిత్ ఫ్యాన్స్ ఇప్ప‌ట్లో పాండ్యాను వ‌దిలిపెట్టేలా లేరుగా..!

  • ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియ‌న్స్ ప్రెస్‌మీట్‌
  • ముంబై ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ మార్క్ బౌచ‌ర్
  • ఈ  ప్రెస్‌మీట్‌లో హిట్‌మ్యాన్‌కు సంబంధించి ఎదురైన‌ ప్ర‌శ్న‌లు దాట‌వేత‌
  • కెప్టెన్, కోచ్ తీరుపై మండిప‌డుతున్న‌ రోహిత్ అభిమానులు
ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం రోహిత్ శ‌ర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్ప‌గిస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఇప్ప‌టికీ రోహిత్ శ‌ర్మ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌న కెప్టెన్సీలో ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్‌కు ముంబై ఇచ్చే గౌర‌వం ఇదేనా అంటూ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఇక‌ మ‌రో మూడు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజ‌న్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్‌ తాజాగా ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ మార్క్ బౌచ‌ర్ పాల్గొన్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో హిట్‌మ్యాన్ గురించి ఎదురైన ప‌లు ప్ర‌శ్న‌ల‌ను అటు హార్దిక్‌, ఇటు బౌచ‌ర్ దాట‌వేశారు. ప్ర‌ధానంగా రోహిత్ కెప్టెన్సీ తొల‌గింపుపై అత‌డి భార్య రితిక స్పంద‌న విష‌య‌మై ఈ ప్రెస్‌మీట్‌లో పాండ్యా, బౌచ‌ర్‌కు ప్ర‌శ్న ఎదురైంది. దీనికి వారు స‌మాధానం చెప్ప‌లేకపోయారు. దీంతో రోహిత్ అభిమానులు మండిప‌డుతున్నారు. 'RIP హార్దిక్ పాండ్యా' అంటూ హ్యాష్ ట్యాగ్‌ను రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్యాగ్‌తో ఇప్ప‌టివ‌ర‌కు వేల సంఖ్య‌లో పోస్టులు పెడుతున్నారు.   

ఇదిలాఉంటే.. 2022లో హార్దిక్ పాండ్యా ముంబైని వ‌దిలి గుజ‌రాత్ టైటాన్స్‌కు వెళ్లాడు. అక్క‌డ కెప్టెన్‌గా బాధ్య‌తలు కూడా ద‌క్కాయి. అత‌ని సార‌థ్యంలోనే గుజ‌రాత్ 2022లో ఐపీల్ టైటిల్ కూడా గెలిచింది. అలాగే 2023లో ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది. ఫైన‌ల్‌లో చెన్నై చేతిలో ప‌రాజ‌యంతో రెండోసారి టైటిల్ గెలిచే అవ‌కాశాన్ని కోల్పోయింది. ఇక ట్రేడింగ్‌లో భాగంగా ముంబై ఫ్రాంచైజీ తిరిగి పాండ్యాను జ‌ట్టులోకి తీసుకుంది. అంత‌టితో ఆగ‌కుండా ఏకంగా కెప్టెన్‌గా నియ‌మించింది. అంతే.. అప్ప‌టినుంచి ముంబై యాజ‌మాన్యంపై రోహిత్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. హిట్‌మ్యాన్‌ను కెప్టెన్‌గా తొల‌గించ‌డం ముంబై చేసిన అతి పెద్ద త‌ప్పు అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే, జ‌ట్టు దీర్ఘకాలిక ప్రయోజ‌నాల కోసమే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఫ్రాంచైజీ చెబుతోంది.


More Telugu News