భార్యను కత్తితో పొడిచి, తల్లికి వీడియో కాల్.. కెనడాలో ఓ పంజాబీ ఘాతుకం

  • కత్తిపోట్లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి
  • భర్తను అదుపులోకి తీసుకున్న కెనడా పోలీసులు
  • ఆర్థిక గొడవలే కారణమని మృతురాలి సోదరి ఆరోపణ
కెనడాలో ఓ పంజాబీ తన భార్యను చంపేశాడు. కత్తితో పలుమార్లు పొడిచి, భార్య అచేతనంగా మారాక ఇండియాలో ఉన్న తల్లికి వీడియో కాల్ చేశాడు. తన భార్యను శాశ్వత నిద్రలోకి పంపించానని తల్లికి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది. దీంతో హత్యా నేరం కింద మృతురాలి భర్తను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు కెనడా పోలీస్ అధికారులు తెలిపారు.

పంజాబ్ లోని లూథియానాకు చెందిన జగ్ ప్రీత్ సింగ్, బల్విందర్ కౌర్ దంపతులకు ఇద్దరు పిల్లలు.. ఉన్నత విద్యాభ్యాసం కోసం పిల్లలు కెనడా వెళ్లగా, వారితో పాటే బల్వీందర్ కూడా అక్కడికే షిఫ్ట్ అయ్యారు. అప్పుడప్పుడు భార్యా పిల్లలను చూసేందుకు జగ్ ప్రీత్ సింగ్ కెనడా వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉంటున్న భార్యా పిల్లల దగ్గరికి వెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం షాపింగ్ కి కూడా వెళ్లివచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ, అదేరోజు రాత్రి బల్వీందర్ పై జగ్ ప్రీత్ దాడి చేశాడు. కత్తితో పలుమార్లు పొడిచి ఆమె స్పృహ తప్పగానే ఇండియాలో ఉన్న తన తల్లికి వీడియో కాల్ చేశాడు. తన భార్యను శాశ్వత నిద్రలోకి పంపించానని తల్లికి చెప్పాడు.

దాడి విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు బల్వీందర్ ను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో జగ్ ప్రీత్ ను హత్యా నేరం కింద పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు కారణమేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. కాగా, అక్కాబావల మధ్య తరచుగా డబ్బుల విషయంలో గొడవలు జరిగేవని బల్వీందర్ కౌర్ సోదరి చెబుతున్నారు. అలాంటిదేమీ లేదని, వారిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని జగ్ ప్రీత్ కుటుంబ సభ్యులు తెలిపారు. హత్య జరిగిన రోజు కూడా పొరపాటున తన భార్యను గాయపరిచానని వీడియో కాల్ లో చెప్పి తమ తల్లిని క్షమాపణ కోరాడని జగ్ ప్రీత్ సోదరుడు చెప్పారు.


More Telugu News