డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగిన పాక్ క్రికెటర్.. ఇదేం పనంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్మోకింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కిన ఇస్లామాబాద్ ఆటగాడు ఇమాద్ వసీం
- పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫైనల్‌లో ఘటన
- ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వసీం
సోమవారం కరాచీ స్టేడియంలో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫైనల్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించి ఇస్లామాబాద్ యునైటెడ్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా ఇస్లామాబాద్ ఆటగాడు ఇమాద్ వసీం డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కాడు. ఇప్పుడీ ఘటన తాలూకు ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఇమాద్ వసీం మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇలా డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ వెలిగించాడు. దీంతో ఇమాద్ చర్యపట్ల నెట్టింట విమర్శలు వస్తున్నాయి. 'డ్రెస్సింగ్ రూమ్‌లో ఇదేం పని భయ్యా..' అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, 5 వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. ఇదిలాఉంటే.. తొమ్మిదో సీజన్ పీఎస్ఎల్ విజయంతో ఇస్లామాబాద్ యునైటెడ్ మూడోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది.