పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ విజేత ఇస్లామాబాద్‌ యునైటెడ్

  • పీఎస్ఎల్ ఫైన‌ల్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ ఓట‌మి 
  • మూడో సారి టైటిల్ గెలిచిన ఇస్లామాబాద్‌
  • అర్ధ శ‌త‌కం (50) తో రాణించిన మార్టిన్ గ‌ప్టిల్
  • 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా ఇమాద్ వ‌సీం
  •  ష‌దాబ్ ఖాన్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్' అవార్డ్   
పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌) తొమ్మిదో సీజ‌న్ విజేతగా ఇస్లామాబాద్‌ యునైటెడ్ నిలిచింది. సోమ‌వారం క‌రాచీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించి ఇస్లామాబాద్‌ మూడోసారి టైటిల్ గెలుచుకుంది. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివ‌రి బంతికి ఇస్లామాబాద్ విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. మొద‌ట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్‌ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 159 ప‌రుగులు చేసింది. ఇస్లామాబాద్ బౌల‌ర్ ఇమాద్ వ‌సీం 5వికెట్లు తీశాడు. 

ఆ త‌ర్వాత 160 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ను న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు మార్టిన్ గ‌ప్టిల్ అర్ధ శ‌త‌కం (50) తో విజ‌యం దిశ‌గా న‌డిపించాడు. చివ‌ర‌లో ఆ జ‌ట్టు బౌల‌ర్ న‌సీం షా (17) మెరుపు బ్యాటింగ్‌తో ఇస్లామాబాద్ విజ‌యం సాధించింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ఇమాద్ వ‌సీం 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు. అలాగే 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్' అవార్డ్ ష‌దాబ్ ఖాన్‌కు ద‌క్కింది.


More Telugu News