సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్

  • యువ క్రికెటర్లు ఇద్దరినీ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి చేర్చిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు
  • గ్రేడ్-సీలో చేర్చిన బీసీసీఐ
  • ఇంగ్లండ్‌తో జరిగిన ధర్మశాల టెస్టు ఆడడంతో అర్హత సాధించారని వెల్లడి
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. వీరిద్దరినీ ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేర్చింది. గ్రేడ్-సీ కేటగిరిలో చేర్చుతూ సోమవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించామని వెల్లడించింది. ఇద్దరూ ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేశారు. చివరిదైన ధర్మశాల టెస్ట్ ఆడిన తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ పొందడానికి అర్హత సాధించారని, బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా యువ క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టుల్లో చోటిచ్చామని వివరించింది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ ఇప్పటివరకు 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారని, ధర్మశాల టెస్ట్‌ కూడా ఆడితే నిబంధనలకు అనుగుణంగా ఇద్దరినీ గ్రేడ్-సీలో చేర్చుతామని ఫిబ్రవరి 28 ప్రకటనలో కూడా తెలిపిన విషయం తెలిసిందే. 

సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్ ఇద్దరూ ఇంగ్లండ్‌తో జరిగిన 5 టెస్టు మ్యాచ్‌‌ల సిరీస్‌లో రాణించారు. సర్ఫరాజ్ ఖాన్ ఐదు ఇన్సింగ్స్‌లో మూడు అర్ధ సెంచరీలు బాదాడు. ఇక రాజ్‌కోట్‌ టెస్టులో ధ్రువ్ జురెల్ మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 90, రెండవ ఇన్నింగ్స్‌లో 39 పరుగులు బాది భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు కూడా దక్కించుకున్నాడు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా ఇదే..
గ్రేడ్ -ఏ+ ఆటగాళ్లు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ - ఏ ఆటగాళ్లు : రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యా
గ్రేడ్ - బీ ఆటగాళ్లు : సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్
గ్రేడ్ -సీ ఆటగాళ్లు: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేశ్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్.


More Telugu News