ఢిల్లీలో చంద్రబాబుకు బొకే ఇవ్వడానికి నిరాకరించడంపై అసలు విషయం చెప్పిన కేశినేని నాని

  • గతంలో ఓసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు
  • చంద్రబాబుకు బొకే ఇవ్వమంటే నెట్టివేశాడంటూ కేశినానిపై కథనాలు
  • చంద్రబాబుపై వ్యతిరేకతతోనే అంటూ నాడు ప్రచారం
  • ఆ రోజు తనకు గల్లా జయదేవ్ తో గొడవ జరిగిందని తాజాగా వెల్లడించిన కేశినేని నాని
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లగా, ఆయనకు బొకే ఇవ్వడానికి ఎంపీ కేశినేని నాని నిరాకరించడం వీడియోల రూపంలో వైరల్ అయింది. మరో ఎంపీ గల్లా జయదేవ్... చంద్రబాబుకు మీరు బొకే ఇవ్వండి అంటూ బొకేను కేశినేని నానికి ఇచ్చేందుకు ప్రయత్నించగా, నాని ఆ బొకేను నెట్టేయడం వీడియోలో కనిపించింది. చంద్రబాబుపై అలకతోనే కేశినేని నాని అలా ప్రవర్తించారని అందరూ భావించారు. కానీ, అసలు విషయం వేరే ఉందని కేశినేని నాని ఇన్నాళ్లకు వెల్లడించారు. 

"ఈ ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందు ఓ విషయంలో నాకు, గల్లా జయదేవ్ కు మధ్య గొడవ జరిగింది. ఆ రోజు చంద్రబాబు ఢిల్లీ వస్తుండడంతో స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లాం. విజిటర్స్ లాంజ్ లో వేచి చూస్తున్న సమయంలో గల్లా జయదేవ్... ఏంటి నీ ఫేస్ బుక్ లో నా ఫొటో పెట్టడం లేదు అని అడిగారు. నీ ఫొటో నా ఫేస్ బుక్ లో పెట్టాల్సిన అవసరం ఏముంది... ఎన్టీఆర్ బొమ్మ, చంద్రబాబు బొమ్మ పెట్టుకుంటాం అన్నాను. 

అందుకు జయదేవ్... నేను పార్లమెంటరీ పార్టీ లీడర్ ను కదా అన్నాడు. నేను లోకేశ్ బొమ్మే పెట్టను... నీది ఎందుకు పెడతాను, నువ్వు నాకు కొలీగ్ వరకే అని బదులిచ్చాను. సిద్ధాంతపరంగా అభిమానిస్తాను కాబట్టి ఎన్టీఆర్ బొమ్మ, పార్టీ అధినేత కాబట్టి చంద్రబాబు బొమ్మ పెడతాను అని గల్లా జయదేవ్ కు వివరించాను. దాంతో అతడు పెద్ద రగడ చేశాడు. ఆ సమయంలో టీడీపీ ఎంపీలందరూ ఉన్నారు. సరే... ఈ చర్చ ఇంతటితో ఆపేద్దాం... బయట ఎక్కడున్నా కూర్చుని దీనిపై మాట్లాడుకుందాం అని అన్నాను. 

నేను సాధారణంగా ఎవరికీ సారీ చెప్పను. కానీ జయదేవ్ కు చెప్పాను... సారీ,  నాకు పెద్ద సోషల్ మీడియా టీం అంటూ లేదు... ఫొటో విషయం మా వాళ్లకు చెబుతాలే... ఇక దీనిపై డిస్కషన్ ఆపేయ్ అన్నాను. కానీ గల్లా జయదేవ్ ఇంకా రెచ్చిపోయాడు. 

ఇంతలో చంద్రబాబు విమానం దిగారని కబురు రావడంతో విజిటర్స్ లాంజ్ లోంచి బయటికి వచ్చాం. ప్రయాణికులు ఎక్కువమంది వస్తుండడంతో అక్కడే నిల్చుండిపోయాం. గల్లా జయదేవ్ కు గిల్టీగా ఉన్నట్టుంది... సొంతంగా బొకే, శాలువా తెచ్చుకున్నాడు. ఆయనకు చిట్టిబాబు అని గుంటూరుకు చెందిన వ్యక్తి అనుచరుడు. జయదేవ్ కు బొకే, శాలువా తీసుకువచ్చి ఇచ్చాడు. 

చంద్రబాబు వచ్చాక నేను కొంచెం దూరంగా ఉంటే... గల్లా జయదేవ్ బొకే నా వైపు జరిపి నువ్వు ఇవ్వు అన్నాడు. నువ్వే ఇవ్వు అంటూ నేను కొద్దిగా చేతితో బొకేను నెట్టాను. అంతకుముందు జరిగిన గొడవ నేపథ్యంలో జయదేవ్ పై నా మనసులో అలా ఉంది. ఎయిర్ పోర్టులోకి మీడియాను అనుమతించరు. గల్లా జయదేవ్ అనుచరుడు చిట్టిబాబే దీన్ని వీడియో తీసి మీడియాకు పంపించాడు. అంతేతప్ప నేను చంద్రబాబును వ్యతిరేకించి ఆ పని చేయలేదు. పార్టీలో ఉన్నంతకాలం ఆయన మాకు లీడర్. ఆ విధంగానే గౌరవించాను" అని కేశినేని నాని నాటి ఘటనను వివరించారు.


More Telugu News