నిన్నటి సభకు ఖాళీ పాస్ లు జారీ చేశారు... ఇలా చేయడం మొదటిసారి చూస్తున్నా: నాదెండ్ల మనోహర్

  • ఆదివారం నాడు చిలకలూరిపేటలో ప్రజాగళం సభ
  • హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
  • పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్న నాదెండ్ల మనోహర్
  • ఈ సాయంత్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామని వెల్లడి
జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ఆదివారం నాడు నిర్వహించిన ప్రజాగళం సభలో ఎన్నడూ చూడని పరిస్థితులు కనిపించాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. 

ఇవాళ ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ప్రజాగళం సభలో పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా దర్శనమిచ్చిందని విమర్శించారు. నిన్నటి సభలో పోలీసులు విఫలమయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కొన్ని అంశాలను జనసేన నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా, పోలీసులు ఊహించని విధంగా ప్రవర్తించారని అన్నారు. 

కాగా, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి హాజరైన సభకు ఖాళీ పాసులు జారీ చేశారని, ఆ పాసులు ఎవరి పేరు మీద జారీ అయ్యాయో ఆ వివరాలు లేవని, వాటిపై ఫొటోలు కూడా లేవని నాదెండ్ల వెల్లడించారు. ఇలా జరగడం మొదటిసారిగా చూస్తున్నానని తెలిపారు. 

ఒక జిల్లా కలెక్టర్, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా సంతకాలు చేసి అలాంటి పాసులు ఇచ్చారో అర్థంకావడంలేదని నాదెండ్ల పేర్కొన్నారు. ఇవి తీవ్రంగా పరిగణించాల్సిన అంశాలని, వీళ్లు దేనికోసం ఇంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారో తెలియాల్సి ఉందని అన్నారు. 

సభ మొత్తం స్థానిక పోలీసుల పరిధిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి వంటి వ్యక్తి వచ్చిన సభలో తీసుకోవాల్సిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ సభ కోసం పోలీసులు ఎందుకు తగినవిధంగా సన్నద్ధం కాలేదు? అని ప్రశ్నించారు. దీనిపై ఈ సాయంత్రం ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు.


More Telugu News