ఆ రెండు పార్టీల చీలిక‌లతో.. ఇద్ద‌రు మంచి మిత్రులు దొరికారు: దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌

  • 2022లో త‌మ కూట‌మి అధికారంలోకి రావ‌డానికి కార‌ణం రెండు పార్టీల్లో చీలికేన‌న్న ఫ‌డ్న‌వీస్‌
  • ఏక్‌నాథ్ షిండే, అజిత్ ప‌వార్ లాంటి ఇద్ద‌రు ప్రాణ స్నేహితులు ల‌భించారంటూ హ‌ర్షం
  • శివ‌సేన‌, ఎన్‌సీపీల‌లో చీలిక కార‌ణంగానే ప్ర‌భుత్వ ఏర్పాటు సాధ్య‌మైంద‌ని వెల్ల‌డి
మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2022లో త‌మ కూట‌మి అధికారంలోకి రావ‌డానికి కార‌ణం రెండు పార్టీల్లో చీలిక అని ఆయ‌న అన్నారు. ఆ చీలిక కార‌ణంగానే త‌న‌కు ఇద్దురు మిత్రులు దొరికారని చెప్పారు. ఆదివారం ముంబైలో జ‌రిగిన ఓ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఫ‌డ్న‌వీస్ ప్ర‌సంగించారు. 

ఈ సంద‌ర్భంగా మ‌హారాష్ట్ర‌ 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మాట్లాడిన మాట‌ల‌ను ఆయ‌న గుర్తు చేశారు. "మ‌ళ్లీ అధికారం చేప‌డ‌తామ‌ని ఫ‌డ్న‌వీస్ ఆ సమ‌యంలో అన్నారు. ఆ వ్యాఖ్య‌లు ఒక ప్ర‌క‌ట‌న మాత్రం కాదు. మ‌హారాష్ట్ర రూపురేఖ‌లు మార్చ‌డానికి తిరిగి అధికారం చేప‌ట్టాల‌ని అనుకున్నా. మ‌ళ్లీ అధికారం చేప‌ట్టేందుకు రెండున్న‌రేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. రెండు పార్టీల్లో చీలిక ద్వారా అధికారం చేట‌ప‌ట్ట‌డం సాధ్యం అయ్యింది. దాంతో నాకు ఇద్ద‌రు మంచి మిత్రులు దొరికారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ ప‌వార్ లాంటి ఇద్ద‌రు ప్రాణ స్నేహితులు ల‌భించారు" అని ఫ‌డ్న‌వీస్ చెప్పుకొచ్చారు. 

ఇక శివ‌సేన అధినేత ఉద్ద‌వ్ థాక‌రే మీద ఏక్‌నాథ్ షిండే 2022 జూన్‌లో తిరుగుబాటు చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీతో చేతులు క‌లిపి మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాంతో శివ‌సేన చీలిపోయింది. షిండే సీఏం ప‌ద‌వీ చేప‌ట్ట‌గా, ఫ‌డ్న‌వీస్ ఉప ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత ఏక్‌నాథ్ షిండే పార్టీని అస‌లైన శివ‌సేన పార్టీగా భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ గుర్తించింది. గతేడాది జులైలో నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వ‌చ్చింది. అజిత్ ప‌వార్ వ‌ర్గం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంలో చేరింది. అలాగే అజిత్ ప‌వార్ వ‌ర్గానిదే అస‌లైన ఎన్‌సీపీ అని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఇలా రెండు పార్టీ చీలిక‌తో త‌న‌కు ఇద్ద‌రు మంచి మిత్రులు దొరికార‌ని దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ అంటున్నారు.


More Telugu News