ప్రతీ తల్లీ, ప్రతీ కూతురూ శక్తి స్వరూపమే.. వారిని కాపాడుకుంటా: ప్రధాని మోదీ

  • శక్తిని నాశనం చేస్తామని కొందరు ఛాలెంజ్ లు చేస్తున్నారు.. సవాల్ స్వీకరిస్తున్నానన్న ప్రధాని
  • వారి నుంచి తన తల్లులను, సోదరీమణులను కాపాడుకుంటానని వెల్లడి
  • తాను భారత మాత పూజారినంటూ జగిత్యాల సభలో మోదీ వ్యాఖ్యలు
  • న్యాయ్ యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పరోక్షంగా ఫైర్
దేశంలోని ప్రతీ తల్లీ, ప్రతీ కూతురూ శక్తి స్వరూపమేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత మాతతో పాటు ప్రతీ తల్లిని, ప్రతీ సోదరీమణిని శక్తి స్వరూపంగా పూజిస్తానని చెప్పారు. ఇలాంటి శక్తి స్వరూపాన్ని నాశనం చేస్తామంటూ కొందరు ఛాలెంజ్ చేస్తున్నారని రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండా విమర్శించారు. ఆ ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని, దేశంలోని శక్తి స్వరూపాన్ని తన ప్రాణమిచ్చైనా కాపాడుకుంటానని మోదీ పేర్కొన్నారు. జగిత్యాలలో జరుగుతున్న బీజేపీ విజయసంకల్ప వేదికపై మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘దేశంలోని ప్రతీ మహిళా నాకు ఓ శక్తి స్వరూపమే. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి శివశక్తి అని నామకరణం చేశాం. అలాంటి శక్తిని వినాశనం చేస్తామని కొంతమంది బయలుదేరారు. ఇప్పుడు శక్తి వినాశకారులకు, శక్తిని పూజించే వారికి మధ్య పోరాటం మొదలైంది. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందనేది జూన్ 4న తెలుస్తుంది’ అని మోదీ చెప్పారు. శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నానని, విపక్ష కూటమి నుంచి శక్తిని కాపాడుకుంటానని మోదీ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ..
ప్రపంచలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మన దేశంలో మొదలైందని మోదీ అన్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా మే 13న తెలంగాణ ప్రజలు చరిత్రను తిరగరాయబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలబడబోతున్నారని చెప్పారు. మూడు రోజుల్లో తాను రెండుసార్లు తెలంగాణకు వచ్చానని, తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు.

రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి 400 సీట్లకు పైగా వస్తాయని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ఆబ్ కీ బార్ 400 కే పార్ నినాదం వినిపిస్తోందని చెప్పారు. ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని ఖతమైపోతుందని జోస్యం చెప్పారు. ‘ప్రధాని మోడీ 400 దాటాలి.. బీజేపీకి ఓటు వేయాలి’ అని తెలుగులో చెప్పి బీజేపీ కార్యకర్తలు, సభకు వచ్చిన జనాలను మోదీ ఉత్సాహపరిచారు.

రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ఓ శక్తి విర్రవీగుతోందని ఆరోపించారు. ఆ శక్తిని అణచివేయడానికి, దానిని నాశనం చేయడానికి మిగతా పార్టీలతో కలిసి పోరాడుతున్నామని చెప్పారు. ఇండియా కూటమి సంఘటితంగా ఈ శక్తిపై పోరాటం చేస్తుందని చెప్పారు.


More Telugu News