దానం నాగేందర్ పై అనర్హత వేటుకు బీఆర్ఎస్ పట్టు.. అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా కనిపించని స్పీకర్

  • బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్
  • నిన్న సాయంత్రం స్పీకర్ నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • రేవంత్ ఒత్తిడి మేరకు స్పీకర్ తమను కలవలేదని విమర్శ
బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. దీంతో, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం దానంపై వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అపాయింట్ మెంట్ తీసుకున్న బీఆర్ఎస్ నేతలు నిన్న సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లారు. స్పీకర్ నివాసానికి వెళ్లిన వారిలో మాగంటి గోపీనాథ్, కాలేరు  వెంకటేశ్, పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్ ఉన్నారు. 

వీరికి నిన్న సాయంత్రం 6 గంటలకు స్పీకర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే రాత్రి 8.30 గంటలైనా వారికి స్పీకర్ కనిపించలేదు. నివాసంలో ఆయన లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఫోన్ చేశారు. వారి కాల్స్ ను కూడా స్పీకర్ లిఫ్ట్ చేయలేదు. దీంతో, స్పీకర్ తీరుపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రేవంత్ ఒత్తిడి మేరకే స్పీకర్ తమను కలవలేదని విమర్శించారు. అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా కలవకపోవడం దారుణమని అన్నారు. సోమవారం కూడా స్పీకర్ ను కలిసే ప్రయత్నం చేస్తామని చెప్పారు.


More Telugu News