కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్
  • నిన్న శ్రేయోభిలాషులు, ఆప్తులతో కీలక సమావేశం
  • నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్న ప్రవీణ్
లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మరో కీలక సన్నివేశం చోటుచేసుకోబోతోంది. బీఎస్సీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. దళిత బహుజన సామాజికవర్గాల్లో ప్రవీణ్ కుమార్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరు తప్పుకుంటున్న తరుణంలో... ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరనుండటం ఆ పార్టీకి కొంత ఊరటగానే చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. 

వాస్తవానికి ఈ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్, బీఎస్పీలకు మధ్య పొత్తు కుదిరింది. అయితే, లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బీఆర్ఎస్ తో పొత్తుకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత్రి మాయావతి నిర్ణయించడం తదితర అంశాలు ప్రవీణ్ కుమార్ కు నచ్చలేదు. కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలకు, ఆ పార్టీ చేస్తున్న ఒత్తిడికి బీఎస్పీ తలొగ్గరాదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను బీఎస్పీలో కొనసాగలేనని... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కవిత అరెస్ట్ ను ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.

మరోవైపు, నిన్న హైదరాబాద్ లో తన శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులతో సమావేశమయినట్టు ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నో అభిప్రాయాలు వచ్చాయని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే నడుస్తామని అందరూ మాట ఇచ్చారని చెప్పారు. తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ పరిరక్షణ కోసం, లౌకికతత్వాన్ని కాపాడటం కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఆయన తెలిపారు.


More Telugu News