అంబానీల ప్రీ-వెడ్డింగ్ వేదిక వద్ద చోరీ.. తమిళనాడుకు చెందిన ఐదుగురి అరెస్టు!

  • రాజ్‌కోట్ వేదిక వద్ద నిలిపి ఉంచిన కారు అద్దాలు పగలగొట్టి రూ.10 లక్షలు, లాప్‌టాప్ చోరీ
  • జామ్‌నగర్ బస్‌స్టాండ్ వద్ద పార్క్ ‌చేసిన మరో కారు అద్దాలు పగలగొట్టి లాప్‌టాప్‌ దొంగతనం
  • నిందితులు తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన వారిగా గుర్తింపు
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొత్తం ఐదుగురు దొంగల అరెస్టు 
అంబానీల ప్రీ-వెడ్డింగ్ వేదిక వద్ద లాప్‌టాప్‌లు, రూ.10 లక్షల నగదు చోరీకి పాల్పడ్డ ఐదుగురు దొంగలను ఢిల్లీలో పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితులందరూ తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన వారని పేర్కొన్నారు. 

ఫిబ్రవరి 12న ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి రాజ్‌కోట్ వేదిక వద్ద పార్క్ చేసిన మెర్సిడెస్ కారు అద్దాలను పగలగొట్టిన నిందితులు రూ.10 లక్షల నగదు, ఓ లాప్‌టాప్‌ను చోరీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా మరో ఐదుగురి పేర్లు బయటపడ్డాయి. ఈ క్రమంలో పోలీసులు జగన్, దీపక్, గుణశేఖర్, ఏకాంబరం‌లను ఢిల్లీలో అరెస్టు చేశారు. వీరందరూ తమిళనాడులోని తిరుచిరాపల్లిలోగల రామ్‌జీ నగర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. 

నిందితులు తొలుత రామ్‌జీనగర్ ‌నుంచి జామ్‌నగర్‌కు వెళ్లారని పోలీసులు తెలిపారు. అక్కడ సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉండటంతో జామ్‌నగర్ బస్‌స్టాండ్‌కు వెళ్లారు. అక్కడ నిలిపి ఉంచిన ఓ కారు అద్దాలను పగలకొట్టి ఓ ల్యాప్‌టాప్‌ చోరీ చేశారు. అనంతరం రాజ్‌కోట్‌కు వెళ్లి అక్కడ మెర్సిడెస్ కారు అద్దం పగలకొట్టి రూ.10 లక్షల నగదు మరో లాప్‌టాప్‌ను దొంగిలించారు. రాజ్‌కోట్, జామ్‌నగర్, అహ్మదాబాద్, ఢిల్లీలో గత 4 నెలల్లో 11 ప్రాంతాల్లో చోరీలు చేసినట్టు నిందితులు విచారణ సందర్భంగా తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళలోనూ నిందితులు చోరీలు చేశారన్నారు.


More Telugu News