ఏపీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగిపై వేటు
- దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్
- వైసీపీ తరపున ప్రచారం చేసిన వీఆర్వో
- విచారణ జరిపించి సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగిపై తొలి వేటు పడింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి వీఆర్వో రమేశ్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అధికార వైసీపీ పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో రమేశ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించారు. రమేశ్ వైసీపీ ప్రచారంలో పాల్గొన్నట్టు విచారణలో నిర్ధారణ అయింది. దీంతో, ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.