పంజాగుట్ట పోలీసుల కస్టడీలోకి ప్రణీత్ రావు

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించనున్న పోలీసులు
  • ఉన్నతాధికారుల పాత్రపై ప్రశ్నించనున్న అధికారులు
  • చంచల్ గూడ జైలు నుంచి పంజాగుట్టకు తరలింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ఆయనను ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతర ఉన్నతాధికారుల పాత్రపై ప్రణీత్ ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీగా వ్యవహరించిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న ప్రణీత్ ను విచారించాలంటూ పంజాగుట్ట పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతర ఉన్నతాధికారుల పాత్రపై ప్రణీత్ ను ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. పది రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరగా.. కోర్టు వారం రోజుల కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి ప్రణీత్ ను పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో ప్రణీత్‌‌ రావు వెల్లడించే వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎస్‌‌ఐబీ లాగర్ రూమ్ లో హార్డ్‌‌ డిస్క్‌‌ల మార్పిడి, ధ్వంసం, డేటా ట్రాన్స్‌‌ఫర్‌‌ సహా ప్రణీత్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి అధికారులు ప్రణీత్ ను ప్రశ్నించనున్నారు.


More Telugu News