కేజ్రీవాల్ కు ఈడీ షాక్.. తొమ్మిదోసారి విచారణకు ఈడీ పిలుపు

  • మార్చి 21న విచారణకు రమ్మంటూ నోటీసులు
  • ముందస్తు బెయిల్ నేపథ్యంలో మరో కొత్త కేసు నమోదు
  • ఢిల్లీ సీఎం అరెస్ట్ తప్పదంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు షాక్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రావాలంటూ తొమ్మిదోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు రావాలని అందులో సూచించారు. వరుస నోటీసులు, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్ కూడా తప్పదంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, తమ నోటీసులకు కేజ్రీవాల్ స్పందించడం లేదంటూ ఇటీవల రౌస్ ఎవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

దీంతో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు.. రూ.లక్ష ష్యూరిటీ, షరతులతో కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఈమేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేజ్రీవాల్ కు ఆదివారం మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ముందస్తు బెయిల్ నేపథ్యంలో కేజ్రీవాల్ పై ఈడీ అధికారులు మరో కొత్త కేసు నమోదు చేసినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.


More Telugu News