నేడు ఏపీకి మోదీ.. పల్నాడులో భారీ బహిరంగ సభ

  • జిల్లాలోని చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ
  • సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా హాజరు
  • దాదాపు పదేళ్ల తరువాత ఒకే వేదికపైకి కూటమి నేతలు
దేశంలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ విజయవాడ కార్యాలయం ప్రకటించింది. జిల్లాలోని చిలకలూరిపేటలో సభ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. 

ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. దాదాపు పదేళ్ల తరువాత కూటమి భాగస్వాములు అందరూ ఒకే వేదికపైకి రానుండటంతో ఈ సభకు ప్రాధాన్యం పెరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఇది తొలి ఎన్డీఏ మీటింగ్. 

ఇటీవల బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మార్చి 11న సుదీర్ఘ చర్చల అనంతరం మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. టీడీపీ 17 లోక్‌సభ స్థానాల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలుస్తుంది. ఇక జనసేన 2 లోక్‌సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే 128 మందితో ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. త్వరలోనే మిగతా పేర్లు కూడా వెల్లడించనున్నారు. ఇక జనసేన ఏడుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. బీజేపీ తన అభ్యర్థుల పేర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది.


More Telugu News