గతంలో ప్రత్యేక హోదా డిమాండ్ తో ఎన్నికలకు వెళ్లిన జగన్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు: షర్మిల

  • విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరిట విశాఖలో కాంగ్రెస్ బహిరంగ సభ
  • హాజరైన పీసీసీ చీఫ్ షర్మిల
  • హోదాపై ఏనాడైనా మోదీని జగన్ నిలదీశారా అన్న షర్మిల 
  • విభజన హామీలు సాధించేవరకు విశ్రమించబోనని ప్రతిన
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో కాంగ్రెస్ పార్టీ నేడు విశాఖలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

ప్రత్యేక హోదా డిమాండ్ తో 2019 ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లిన జగన్, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ఏ నాయకుడు రాష్ట్రాన్ని పట్టించుకోలేదని, ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మోసం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై మోదీని ఏనాడైనా జగన్ గట్టిగా నిలదీశారా? అని షర్మిల ప్రశ్నించారు. చిన్నాన్నను చంపినవారిని రక్షించాలని అడిగేందుకు మాత్రం ఢిల్లీ వెళుతున్నారని ఆరోపించారు. 

"నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయతీ ఉంది. నా పుట్టింట్లో అన్యాయం జరుగుతోంది కాబట్టి ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చేంతవరకు, పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంతవరకు, విశాఖ ఉక్కును కాపాడుకునేంత వరకు, మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంతవరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ్నించి కదలదు" అని షర్మిల ఉద్ఘాటించారు.


More Telugu News