ధూమపానం అలవాటు ఉన్నవారిలో స్ట్రోక్ ముప్పు అధికం

  • ధూమపానం అలవాటు, స్ట్రోక్ మధ్య సంబంధంపై అధ్యయనంలో వెలుగులోకి కీలక విషయాలు
  • ఫిల్టర్ చేసిన, ఫిల్టర్ చేయని సిగరెట్లు రెండూ ప్రమాదమే
  • స్మోకింగ్ అలవాటు లేకపోయినా వారానికి 10 గంటల పాటు పొగాకు ఉత్పత్తుల పొగకు గురైతే రెట్టింపు దుష్ప్రభావం
  • హెచ్చరించిన తాజా అధ్యయనం
స్మోకింగ్ అలవాటు లేనివారితో పోల్చితే ధూమపానం అలవాటు ఉన్నవారిలో స్ట్రోక్ ముప్పు అధికమని నూతన అధ్యయనం హెచ్చరించింది. ధూమపానం అలవాటు, స్ట్రోక్ మధ్య సంబంధంపై పరిశోధన చేపట్టగా ఈ విషయం నిర్ధారణ అయ్యిందని ఈ-క్లినికల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా మెదడుకు తగిన రక్త సరఫరా లేని స్థితిలో వచ్చే ‘ఇస్కిమిక్ స్ట్రోక్‌’కు ఎక్కువ అవకాశాలున్నాయని హెచ్చరించింది. బెంగుళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని ప్రపంచవ్యాప్తంగా చేపట్టారు. ఫిల్టర్ చేసిన, ఫిల్టర్ చేయని సిగరెట్లు రెండూ స్ట్రోక్ ముప్పుని పెంచుతాయని హెచ్చరించారు.

స్మోకింగ్ అలవాటు లేకపోయినా వారానికి 10 గంటల పాటు పొగాకు ఉత్పత్తుల పొగకు గురయ్యేవారిలో స్ట్రోక్ ప్రమాదం దాదాపు రెట్టింపుగా ఉంటుందని పేర్కొంది. మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడం కారణంగా సంభవించే ఇస్కిమిక్, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం అధికంగా ఉందని తెలిపింది. ముఖ్యంగా ప్రతి రోజూ 20 కంటే ఎక్కువ సిగరెట్లు కాల్చే అలవాటున్న 50 ఏళ్లలోపు వయసు వారిలో రిస్క్ ఎక్కువని అధ్యయనం హెచ్చరించింది. భౌగోళికంగా చూస్తే పశ్చిమ యూరోపియన్ దేశాలు, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ధూమపానం చేసేవారికి స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది.


More Telugu News