పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి... మొదటి ఎమ్మెల్సీ నీకే అంటూ వర్మకు చంద్రబాబు హామీ

  • పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్
  • తీవ్ర నిరాశకు గురైన పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ
  • వర్మను ఉండవల్లి పిలిపించిన చంద్రబాబు
  • పవన్ రాష్ట్రం కోసం 2014లో పోటీ చేయలేదని వర్మకు నచ్చజెప్పిన బాబు
  • అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ
  • పవన్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని బాబుకు మాటిచ్చిన వర్మ
పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తుండగా, టికెట్ పై ఆశలు పెట్టుకున్న టీడీపీ ఇంఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, వర్మను చంద్రబాబు నేడు ఉండవల్లి పిలిపించారు. పరిస్థితులను వివరించి ఆయనకు నచ్చజెప్పారు. ఎమ్మెల్సీ ఇస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. 

" పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గ స్థానం జనసేనకు వెళ్లింది. పిఠాపురంను గతంలో వర్మ బాగా అభివృద్ధి చేశారు. కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా వెనుతిరగలేదు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తుండడంతో ఈసారి సీటును త్యాగం చేయాలని వర్మను కోరా. అందుకు వర్మ అంగీకరించారు. 2014లోనూ పవన్ కల్యాణ్ రాష్ట్రం బాగుండాలని పోటీ చేయకుండా సహకరించారు. ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది... వ్యతిరేక ఓటు చీలకూడదనే కలిసి పోటీకి వచ్చారు. 

త్వరలో ప్రకటించే ఎమ్మెల్సీలలో వర్మ మొదటి వ్యక్తిగా ఉంటారు. వర్మను అభిమానించే ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే వైసీపీ నేతలు ఈర్ష్యతో ప్రవర్తిస్తున్నారు. పిఠాపురంలో వర్మే అభ్యర్థి అనుకుని కార్యకర్తలు పని చేసి పవన్ ను మంచి మెజారిటీతో గెలిపించాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

వర్మ మాట్లాడుతూ.... "చంద్రబాబు ఆశీస్సులతో పిఠాపురంలో పార్టీని నిలబెట్టాను, కార్యకర్తలను చూసుకుంటున్నా. పురుషోత్తపట్నం ఎత్తిపోతల, ఏలూరు ఫేజ్-2 పనులు ఆగిపోయాయి. వాటిని పూర్తి చేయాలని కోరుతున్నా. చంద్రబాబుకు నేను తాలిబన్ లాంటి శిష్యుడ్ని. చంద్రబాబు ఏం చెబితే అదే. పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిపిస్తాం" అని వర్మ పేర్కొన్నారు.


More Telugu News