ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది... ఎన్నికల షెడ్యూల్ పై ప్రధాని మోదీ స్పందన

  • నేడు లోక్ సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
  • ఎన్నికలకు ఎన్డీయే కూటమి సర్వసన్నద్ధంగా ఉందన్న ప్రధాని మోదీ
  • తమ పరిపాలన ఆధారంగా ప్రజల వద్దకు వెళతామని వెల్లడి
కేంద్ర ఎన్నికల సంఘం నేడు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 26 ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగ వచ్చేసిందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలు-2024 తేదీలను ఈసీ ప్రకటించిందని తెలిపారు. బీజేపీ-ఎన్డీయే కూటమి ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉందని మోదీ సమరశంఖం పూరించారు. తాము అందించిన సుపరిపాలన, వివిధ రంగాలకు తాము అందించిన సేవల ఆధారంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతామని వివరించారు.

ప్రజలు ఆ దరిద్రగొట్టు పాలన వదిలించుకున్నారు.

పదేళ్ల కిందట, మేం ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు... ఇండియా కూటమి చేతిలో తాము మోసపోయామని భావించిన ప్రజలు, ఆ కూటమి దరిద్రగొట్టు పాలనకు చరమగీతం పాడారు. ఫలానా రంగంలో స్కాం జరగలేదు అనకుండా, ప్రతి ఒక్క రంగంలోనూ కుంభకోణాలకు పాల్పడ్డారు. తమ అనారోగ్యకర ప్రభుత్వ విధానాలతో దేశాన్ని భ్రష్టు పట్టించారు. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా భారత్ ను దూరంగా ఉంచింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రావడం, దేశం అద్భుతమైన మలుపు తీసుకుంది. 

చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఏం చేయగలదో నిరూపించాం

140 కోట్ల మంది ప్రజలతో పరిపుష్టమైన దేశం అభివృద్ధి పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మనం ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. కోట్లాది మంది ప్రజలు దారిద్ర్యం నుంచి విముక్తి పొందారు. మా పథకాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు అందుతున్నాయి. అన్ని వర్గాలను సంతృప్తి పరచడం గొప్ప ఫలితాలను ఇచ్చింది. చిత్తశుద్ధి, నిబద్ధత, చెప్పింది చేసే సామర్థ్యం ఉన్న ఓ ప్రభుత్వం ఏమి చేయగలదో భారతదేశ ప్రజలు కళ్లారా చూశారు. అందుకే ప్రజలు మా నుంచి ఇంకా ఆశిస్తున్నారు. ఈ కారణంగానే దేశంలోని మూలమూలలా అన్ని వర్గాల ప్రజలు అబ్ కీ బార్... 400 పార్ (ఈసారి 400 సీట్లు) అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. 

వీళ్లింకా మారలేదు

మన ప్రతిపక్షం ఇప్పటికీ అరాచకత్వాన్నే నమ్ముకుంది. వాళ్ల దగ్గర పోరాడేందుకు తగిన అంశాలే లేవు. వారు చేయగలిగిందల్లా... మనల్ని తిట్టడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం. వారి కుటుంబ రాజకీయాలు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారి అవినీతి చిట్టా కూడా ఘనంగానే ఉంది. అలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. మేం ఈ ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక చేయాల్సిన పని చాలా ఉంది. ఈ పదేళ్ల కాలం అంతా గతంలో 70 ఏళ్లు పాలించిన వారి డొల్లలను పూడ్చడానికే సరిపోయింది. ముఖ్యంగా, భారత్ ఆత్మ నిర్భరత సాధిస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఈ స్ఫూర్తి ఆధారంగానే అభివృద్ధి చేస్తాం. 

మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యం

దారిద్ర్యం, అవినీతిపై పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తాం. సామాజిక న్యాయానికి మరింత ప్రాముఖ్యతనిస్తాం. ఇక మా లక్ష్యం భారత్ ను ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే. యువత కలలను సాకారం చేసేందుకు మరింతగా పాటుపడతాం. మరో వెయ్యేళ్ల పాటు భారత్ ఘనంగా వెలిగిపోతుందన్న దివ్యమైన దృశ్యాన్ని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. రానున్న ఐదేళ్లలో ఈ దిశగా సమష్టి కృషితో భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్ ను రూపొందించడం మా ముందున్న కర్తవ్యం. 

అదే నా బలం

ప్రజల ఆశీస్సులే నాకు బలం. ముఖ్యంగా పేదలు, రైతులు, యువత, నారీ శక్తి అందించే దీవెనల ద్వారా నాకు శక్తి లభిస్తుంది. నేను కూడా మోదీ కుటుంబ సభ్యుడ్నే అని ప్రజలు చెబుతుంటే నాలో ఆనందం తాండవిస్తుంది. అంతేకాదు, వికసిత భారత్ ను నిర్మించడానికి మరింత గట్టిగా కృషి చేసేలా నాకు ఉత్సాహాన్ని అందిస్తుంది. మనం అనుకున్నది సాధించే శకం ఇది... మనందరం కలిసికట్టుగా లక్ష్యాన్ని అందుకుందాం" అని పిలుపునిచ్చారు.


More Telugu News