18 ఏళ్లు నిండితే చాలు విద్యార్థులకు ఆటోమేటిక్‌గా ఓటరు ఐడీ కార్డులు

  • ప్రత్యేక వ్యవస్థను సంసిద్ధం చేస్తున్న భారత ఎన్నికల సంఘం
  • 12వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్న ఈసీ
  • వెల్లడించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్
18 ఏళ్లు నిండిన విద్యార్థులకు ఓటర్ ఐడీ కార్డులు అందించేలా భారత ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అర్హత కలిగిన 12వ తరగతి (ఇంటర్ ద్వితీయ సంవత్సరం) విద్యార్థులు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్ ఐడీ కార్డులు జారీ చేయనున్నామని, 18 ఏళ్లు నిండిన వెంటనే ఆటోమేటిక్‌గా ఓటరు కార్డులను అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన తెలిపారు. ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని, 18 ఏళ్లు నిండడానికి ముందే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు.

మరోవైపు హింస కారణంగా మణిపూర్‌లో వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లినవారు శిబిరాల నుంచి ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేశామని, జమ్మూకశ్మీర్‌ వలసజీవుల కోసం అనుసరిస్తున్న విధానంలా ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారని, ఇందులో మొదటిసారి ఓటు వేయబోతున్న యువ ఓటర్లు 1.8 కోట్ల మంది ఉన్నారని రాజీవ్ కుమార్ వెల్లడించారు.


More Telugu News