క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు మూడు సార్లు తమ వివరాలు బహిర్గతం చేయాలి: ముఖేశ్ కుమార్ మీనా

  • సార్వత్రిక ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
  • ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ప్రెస్ మీట్
సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏపీలో 27,612 ప్రాంతాల్లో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా సిబ్బందినే నియమిస్తున్నామని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. 

ఓటరు గుర్తింపు లేని వారు 12 ఐడీ కార్డులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చని  వివరించారు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకం కార్డు, పాస్ బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్టు, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడీ కార్డు, ఇతర అఫిషియల్ ఐడెంటిడీ కార్డులు చూపించి ఓటేయవచ్చని తెలిపారు. 

ఇక, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసిన అర్హులందరికీ ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకమైన సదుపాయం తీసుకువచ్చామని, ఎన్నికలకు ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్ అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. 

అయితే, ఆన్ లైన్ లో నామినేషన్ సమర్పించే అవకాశం ఉండదని, ఓ అభ్యర్థి ఆన్ లైన్ లో నామినేషన్ పత్రాలు నింపిన తర్వాత, వాటిని ప్రింట్ తీసుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా సమర్పించాల్సి ఉంటుందని ముఖేశ్ కుమార్ మీనా వివరించారు. రూ.25 వేలు సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఆన్ లైన్ లో చెల్లించవచ్చని తెలిపారు. 

ఫారం-26 కింద అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని, అందులో ఎలాంటి మార్పు లేదని అన్నారు. ఆయా అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో సదస్సు నిర్వహించామని వెల్లడించారు. అఫిడవిట్ లో ప్రతి కాలమ్ నింపాల్సిందేనని వివరించామని చెప్పారు. 

ముఖ్యంగా, క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు తమ వివరాలను పోలింగ్ కు ముందు మూడు సార్లు వెల్లడించాల్సి ఉంటుందని మీనా స్పష్టం చేశారు. దినపత్రికలోనూ, టీవీ చానళ్లలోనూ, తమ రాజకీయ పార్టీల వెబ్ సైట్లలోనూ తమ వివరాలను బహిర్గతం చేయాలని వివరించారు. ఇక, 85 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తున్నామని వెల్లడించారు.


More Telugu News