సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ

  • భారత్ లో సీఏఏ అమలు
  • సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
  • ముస్లింల ఉనికే ప్రశ్నార్థకమవుతుందని వెల్లడి
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఏఏని ఎన్పీఆర్ (నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్), ఎన్ఆర్ సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)తో కలిపి చూడాలని పేర్కొన్నారు. 

పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్ కు వలస వచ్చే హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇవ్వడానికి తానేమీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 

కానీ, భవిష్యత్తులో మీరు ఎన్పీఆర్, ఎన్ఆర్ సీ తీసుకువస్తే 17 కోట్ల మంది ముస్లింల ఉనికి ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. వారికి ఓ సొంత దేశం అంటూ లేకుండా చేయాలనుకుంటున్నారు అని మండిపడ్డారు.

హైదరాబాద్ ప్రజలు ఎన్నికల్లో సీఏఏకి వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీని ఓడిస్తారని ఒవైసీ పేర్కొన్నారు. ఓ ప్రాంతం ఆధారంగా చట్టాలు చేయలేరని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చిందని అన్నారు.


More Telugu News