ముంబైతో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌.. డ‌బ్ల్యూపీఎల్‌ లో బెంగ‌ళూరు నిజంగా మ్యాజిక్ చేసిందిగా..!

  • డ‌బ్ల్యూపీఎల్ ఫైన‌ల్ చేరిన బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్
  • ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఓట‌మితో ఇంటిదారి ప‌ట్టిన ముంబై ఇండియ‌న్స్‌
  • ఆదివారం టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నున్న స్మృతి మంధాన సేన‌
మ‌హిళ‌ల ప్రీమియ‌ర్‌ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌)లో డిపెండింగ్ ఛాంపియ‌న్‌ ముంబై ఇండియ‌న్స్‌తో శుక్ర‌వారం జ‌రిగిన‌ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ చివ‌ర్లో నిజంగా మ్యాజిక్ చేసింద‌నే చెప్పాలి. లేకుంటే చాలా తేలిక‌పాటి స‌మీక‌ర‌ణాల‌ను కాపాడుకుని మ్యాచ్‌ గెల‌వ‌డం అంటే మాట‌లు కాదు. 136 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై విజ‌యానికి ఒకా‌నొక ద‌శ‌లో 24 బంతుల్లో కేవ‌లం 32 ప‌రుగులు మాత్ర‌మే కావాలి. క్రీజులో కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్‌ ఉంది. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి. ఈ సమీక‌ర‌ణాల‌తో టీ20 మ్యాచ్‌లో ఏ జ‌ట్టు ప‌రాజ‌యం పొంద‌డం అంత సులువు కాదు. కానీ, ఈ మ్యాచ్‌లో అదే జ‌రిగింది. 

నిల‌క‌డ‌గా ఆడుతూ విజ‌యం దిశ‌గా సాగుతున్న ముంబై ఆ త‌ర్వాత వ‌రుస ఓవ‌ర్ల‌లో వికెట్లు పారేసుకుంది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ (33), స‌జ‌న (01) వెంట‌వెంట‌నే పెవిలియ‌న్ చేర‌డంతో మ్యాచ్ మ‌లుపు తిరిగింది. ఈ క్ర‌మంలో ముంబై విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. చివ‌రి ఓవ‌ర్ ఆశ‌కు ఇచ్చింది కెప్టెన్ స్మృతి మంధాన. అప్ప‌టికే బాగా ఆడుతున్న అమేలియా క్రీజులో ఉండ‌డంతో ముంబై విజ‌యంపై ధీమాగానే ఉంది. కానీ, ముంబై బ్యాట‌ర్ల‌ను ఆశ క‌ట్ట‌డి చేసింది. తొలి మూడు బంతుల‌కు 4 ప‌రుగులు మాత్రమే ఇచ్చింది. ఆ త‌ర్వాత నాలుగో బంతికి పూజ (04) ను పెవిలియ‌న్ పంపించింది. దీంతో స‌మీక‌ర‌ణం 2 బంతుల్లో 8 ప‌రుగుల‌కు మారింది. ఆ త‌ర్వాతి రెండు బంతుల‌కు కేవలం 2 ప‌రుగులు ఇచ్చి బెంగ‌ళూరును 5 ప‌రుగుల తేడాతో గెలిపించింది. ఇలా స్మృతి మంధాన సేన‌ చివ‌రి వ‌ర‌కు పోరాడి అద్భుత విజ‌యాన్ని సాధించి ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఆదివారం టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.


More Telugu News