నేటి భారత్ భిన్నమైనది! తన సమస్యలను తనే పరిష్కరించుకోగలదు: విదేశాంగ మంత్రి జైశంకర్

  • భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రపంచం గుర్తిస్తోందన్న విదేశాంగ శాఖ మంత్రి
  • తన సమస్యలకు తానే పరిష్కరించుకోగల దేశంగా భారత్‌పై అభిప్రాయం ఉందని వెల్లడి
  • విదేశాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందని వ్యాఖ్య
భారత్‌పై ప్రపంచ దేశాల అభిప్రాయంలో మార్పులు వస్తున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. తన సమస్యలను తనే పరిష్కరించుకోగల దేశంగా భారత్‌పై అభిప్రాయం ఉందని అన్నారు. ఈటీ అవార్డ్స్ 2023 కార్యక్రమంలో తాజాగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ‘సంవత్సరం మేటి సంస్కరణకర్త’ అవార్డును అందించారు. అనంతరం భారత్‌పై ప్రపంచదేశాల ధోరణిలో వస్తున్న మార్పును ఆయన ప్రస్తావించారు. 

‘‘భారత్ తన సమస్యలకు తగిన పరిష్కారాలను తానే వెతుక్కోగల దేశంగా ప్రపంచం పరిగణిస్తోంది. తన అభిప్రాయాలను నిర్భీతిగా వ్యక్తం చేస్తూ, దేశ ప్రజల ప్రయోజనాలు, ఇంధన భద్రత, జాతీయ భద్రతలను పరిరక్షించగల దేశంగా అభిప్రాయం ఉంది. కాబట్టి, నేటి భారత్ భిన్నమైనది. భారత్‌కు విదేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నేనెంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను’’ అని ఆయన అన్నారు. 

గత కొన్నేళ్లల్లో భారత్ ప్రపంచంపై బలమైన ముద్ర వేసిందన్నారు. కొవిడ్ సంక్షోభం విసిరిన సవాళ్లను దీటుగా ఎదుర్కొందన్నారు. వ్యాక్సిన్ మైత్రీ పేరిట ప్రపంచ దేశాలకు టీకాలను భారత్ అందించిందని గుర్తు చేశారు. ఆపరేషన్ గంగా, కావేరి, అజేయ్ వంటి మిషన్లతో విదేశాల్లోని భారతీయులను ఆదుకోవడంతో పాటూ వందేభారత్ మిషన్‌ ద్వారా గొప్ప విజయం అందుకుందన్నారు. భారత్ సాధిస్తున్న అభివృద్ధి ప్రపంచం దృష్టిలో పడిందని అన్నారు. విదేశాల్లోని అనేక ప్రాజెక్టులు, పెరిగిన ఎగుమతులు భారత్ సాధించిన విజయాలని చెప్పారు.


More Telugu News