ఎన్నికల నేపథ్యంలో.. దేశప్రజలకు మోదీ బహిరంగ లేఖ!

  • తమ హయాంలో భారత్ సాధించిన అభివృద్ధిని ఏకరువు పెట్టిన ప్రధాని
  • తాము తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలకు ప్రజల మద్దతే శక్తినిచ్చిందని వ్యాఖ్య
  • వికసిత్ భారత్ నిర్మాణం కోసం మరోసారి ప్రజల మద్దతు కోరుతున్నట్టు విన్నపం
త్వరలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తమ హయాంలో భారత్ సాధించిన అభివృద్ధిని ప్రస్తావించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
‘‘ప్రియమైన నా కుటుంబసభ్యులారా.. 
మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉంది. 140 కోట్ల మంది భారతీయుల నమ్మకం, మద్దతు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. గత 10 ఏళ్లల్లో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు మా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం. పేదలు, రైతులు, యువత, మహిళల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది.

పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా గృహాలు, అందరికీ విద్యుత్, నీరు, ఎల్పీజీతో పాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం, రైతులకు ఆర్థిక సహాయం, మాతృ వందన యోజన ద్వారా మహిళలకు సహాయం, మరెన్నో ప్రయత్నాల విజయానికి మీరు నాపై ఉంచిన నమ్మకమే కారణం.

మన దేశం సంప్రదాయం, ఆధునికత రెండింట్లోనూ సమాంతరంగా ముందుకు సాగుతోంది. గత దశాబ్దంలో తదుపరి తరం మౌలిక సదుపాయాల్లో అపూర్వమైన నిర్మాణాన్ని చూసింది. ఈ విషయంలో ప్రతి పౌరుడూ గర్వపడుతున్నాడు. పార్లమెంటులో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నారీ శక్తి వందన్ చట్టంతో పాటు ట్రిపుల్ తలాక్‌పై కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం. జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, నూతన పార్లమెంటు భవన నిర్మాణం వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన చర్యలు తీసుకున్నాం.

ఇలా దేశ సంక్షేమానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆశావహమైన ప్రణాళికలను రూపొందించడానికి, వాటిని సజావుగా అమలు చేయడానికి మీ మద్దతు నాకు అపారమైన శక్తిని ఇస్తుంది. ఇక వికసిత్‌ భారత్‌ను నిర్మించాలనే సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ మద్దతు కోసం ఎదురుచూస్తున్నాను. మనం కలిసి మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని నేను విశ్వసిస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలతో.. మీ మోదీ’’ అంటూ ప్రధాని పేర్కొన్నారు.


More Telugu News