కవితపై కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం మాకు లేదు: కిషన్ రెడ్డి

  • ఎలాంటి నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకు? అని కిషన్ రెడ్డి ప్రశ్న
  • ఇన్నాళ్లు ఈడీ విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకున్నారని ఆరోపణ
  • విచారణ సంస్థలు తమ పని తాము చేసుకొని పోతాయన్న కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 12 మంది ఈడీ అధికారులు ఈ రోజు కవిత నివాసానికి వెళ్లి నాలుగైదు గంటలు విచారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకు? అని ప్రశ్నించారు. ఈడీ విచారణకు కవిత పూర్తిగా సహకరించాలని సూచించారు.

ఇన్నాళ్లూ ఈడీ విచారణకు సహకరించకుండా ఆమె తప్పించుకున్నారని ఆరోపించారు. ఆమె సహకరించనందునే ఈడీ నేరుగా ఆమె ఇంటికి వెళ్లిందన్నారు. ఈడీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని గుర్తు చేశారు. ఎవరి పైనా కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం తమకు లేదన్నారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకొని పోతాయన్నారు.


More Telugu News