వైసీపీకి రాజీనామా చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి

  • వైసీపీలో తనను కార్యకర్త కంటే హీనంగా చూశారన్న వంటేరు
  • పార్టీకి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన
  • తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని వెల్లడి
  • ఏ పార్టీలో చేరేదీ త్వరలో చెబుతానని స్పష్టీకరణ
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడుతున్నట్టు నేడు ప్రకటన చేశారు. 

వైసీపీలో పదేళ్ల పాటు తనను కార్యకర్త కంటే హీనంగా చూశారని వంటేరు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ విజయం కోసం శక్తివంచన లేకుండా పాటుపడ్డానని చెప్పారు. అయితే జిల్లాలో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడంతో తన శ్రమకు ఫలితం లేకుండా పోయిందని, పార్టీ కూడా తనను పట్టించుకోవడం మానేసిందని వంటేరు వేణుగోపాల్ రెడ్డి వాపోయారు. 

ఆత్మాభిమానం దెబ్బతినే పరిస్థితుల్లో పార్టీలో ఉండలేకపోతున్నానని స్పష్టం చేశారు. అందుకే, ఇవాళ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వైసీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని వివరించారు.  

తనకు అన్ని ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని అన్నారు. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.


More Telugu News