తెలంగాణ టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌రఖాస్తుకు ఆఖ‌రి గ‌డువు ఎప్పుడంటే..!

  • మార్చి 27వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ
  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఏప్రిల్ 10
  • మే 20 నుంచి జూన్ 3వ తారీఖు వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష‌లు
తెలంగాణ టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది. మెగా డీఎస్‌సీకి ముందే టెట్ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావ‌డంతో విద్యాశాఖ గురువారం (మార్చి 14న‌) టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మార్చి 27వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంది. ఏప్రిల్ 10వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 20 నుంచి జూన్ 3వ తారీఖు వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని విద్యాశాఖ వెల్ల‌డించింది. ఇత‌ర పూర్తి స‌మాచారం కోర‌కు అధికారిక వెబ్‌సైట్ tstet.cgg.gov.in లో చూడాల‌ని తెలిపింది. కాగా, టెట్ నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన కొద్దిసేప‌టికే టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డం విశేషం. కాగా, 2023 సెప్టెంబ‌రులో నిర్వ‌హించిన టెట్ పేప‌ర్-1 ప‌రీక్ష‌లో 82,489 మంది (36.89 శాతం) మాత్ర‌మే ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక పేప‌ర్‌-2లో 29,073 మంది (15.30 శాతం) మాత్ర‌మే ఉత్తీర్ణుల‌య్యారు. 


కొన‌సాగుతున్న డీఎస్‌సీ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌
తెలంగాణ మెగా డీఎస్‌సీ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కొనసాగుతోంది. మార్చి 4వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. మొత్తం 11,062 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఇక మొత్తం 11,062 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6508, స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ ఎస్జీటీ 796 ఉద్యోగాలు ఉన్నాయి. గ‌తంలో డీఎస్‌సీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారు తాజా నియామ‌కాల‌కు కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది. తాజాగా టెట్ నోటిఫికేష‌న్ విడుద‌లైన నేప‌థ్యంలో డీఎస్‌సీకి భారీగా ద‌ర‌ఖాస్తులు వ‌స్తాయ‌ని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.


More Telugu News