టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు

  • టెస్టుల నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన మాథ్యూ వేడ్
  • వైట్‌బాల్‌ క్రికెట్‌పై మ‌రింత‌ దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణ‌యమంటూ ప్ర‌క‌ట‌న‌
  • 'ది షెఫీల్డ్ షీల్డ్' టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ త‌న రెడ్‌బాల్ క్రికెట్‌లో ఆఖ‌రిద‌ని వేడ్ వెల్ల‌డి
ఆస్ట్రేలియా వికెట్ కీప‌ర్‌ బ్యాట‌ర్ మాథ్యూ వేడ్ రెడ్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతున్న‌ట్లు తెలిపాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌పై మ‌రింత‌ దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించాడు. కొంత‌కాలం ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో కొన‌సాగుతాన‌ని చెప్పాడు. ఇక‌ ఆస్ట్రేలియా త‌ర‌ఫున టెస్టులు ఆడ‌టం అంత‌ర్జాతీయ కెరీర్‌లో త‌న‌కు అత్యంత ప్ర‌త్యేక‌మైంద‌ని పేర్కొన్నాడు. 'ది షెఫీల్డ్ షీల్డ్' టోర్నీలో టాస్మానియా-వెస్ట‌ర్న్ ఆస్ట్రేలియా మ‌ధ్య మార్చి 21వ తేదీన మొద‌లుకానున్న ఫైన‌ల్ మ్యాచ్ త‌న రెడ్ బాల్ క్రికెట్‌లో ఆఖ‌రిద‌ని మ‌థ్యూ వేడ్ చెప్పుకొచ్చాడు. 

"మొద‌ట నా కుటుంబ స‌భ్యుల‌కు థ్యాంక్స్ చెప్పాలి. నా భార్య జూలియా, పిల్ల‌లు వింట‌ర్‌, గోల్డయి, డ్యూక్‌.. నా రెడ్‌బాల్ క్రికెట్ కెరీర్ మొత్తం వారు ఎన్నో త్యాగాలు చేశారు. సంప్ర‌దాయ ఫార్మాట్‌లో ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డాన్ని ఎంతగానో ఆస్వాదించాను. వైట్‌బాల్ క్రికెట్‌లో కొన‌సాగినా.. బ్యాగీ గ్రీన్‌తో దేశం త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌డ‌మే నా కెరీర్‌లో ఎప్ప‌టికైనా హైలైట్‌గా నిలుస్తుంది. నా జ‌ట్టు స‌భ్యులంద‌రికీ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు. నేను ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట‌ర్‌గా ఎద‌గడానికి పునాదులు వేసిన క్రికెట్ విక్టోరియాకి ధ‌న్య‌వాదాలు. నా స్వ‌రాష్ట్రంలో కెరీర్ ముగించ‌డానికి స‌హ‌క‌రించిన క్రికెట్ టాస్మానియాకు రుణ‌ప‌డి ఉంటాను" అని మ‌థ్యూ వేడ్ ఉద్వేగ‌పూరితంగా త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న చేశాడు.   

కాగా, 2012లో ఆసీస్ త‌ర‌ఫున టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ స్టార్ ఆట‌గాడు 2021లో త‌న చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడాడు. మ‌రో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ అలెక్స్ క్యారీ రావ‌డంతో మ‌థ్యూ వేడ్ కు అవకాశాలు రాలేదు. ఈ క్ర‌మంలో భార‌త్‌తో గాబా స్టేడియంలో ఆఖ‌రిగా టెస్టు మ్యాచ్ బ‌రిలో దిగాడు. ఇక త‌న టెస్టు కెరీర్ మొత్తంలో 36 టెస్టులు ఆడిన మ‌థ్యూ వేడ్.. 4 సెంచ‌రీల స‌హాయంతో 1613 ప‌రుగులు చేశాడు. అటు ఐపీఎల్‌లో ఈ స్టార్ ఆట‌గాడు గుజ‌రాత్ త‌ర‌ఫున ఆడుతున్నాడు. ది షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ ఆడేందుకు అత‌డు ఐపీఎల్ ప్రారంభ మ్యాచుల‌కు అందుబాటులో ఉండ‌డం లేదు.


More Telugu News