నేడు హైదరాబాద్ లో మోదీ రోడ్ షో.. భారీ ఆంక్షలు

  • రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణకు వస్తున్న మోదీ
  • ఈ సాయంత్రం మల్కాజ్ గిరిలో రోడ్ షో
  • రేపు నాగర్ కర్నూల్ లో భారీ బహిరంగ సభ
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో బీజేపీ హైకమాండ్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పర్యటించారు. తాజాగా మరో రెండు రోజుల పర్యటన కోసం మోదీ ఈరోజు హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. ఈరోజు ఆయన మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనుంది. రేపు నాగర్ కర్నూలులో బహిరంగ సభలో పాల్గొంటారు. 

ప్రధాని మోదీ షెడ్యూల్:
  • సాయంత్రం 4.55 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ
  • సాయంత్రం 5.15 నుంచి 6.15 వరకు మాల్కాజ్ గిరిలో రోడ్ షో
  • 6.40 గంటలకు రాజ్ భవన్ కు చేరుకోనున్న ప్రధాని. రాత్రికి అక్కడే బస
  • రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ కు బయల్దేరనున్న పీఎం
  • 11.45 నుంచి 12.45 గంటల వరకు నాగర్ కర్నూల్ లో బహిరంగ సభ
  • మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్ కర్నూల్ నుంచి హెలికాప్టర్ లో గుల్బర్గా వెళ్లనున్న మోదీ. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగుపయనం.

మరోవైపు మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. మోదీ రోడ్ షో చేసే 5 కిలోమీటర్ల మేర రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ లు, పారా గ్లైడర్లు ఎగురవేయడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐసీపీ సెక్షన్లు 188, 121, 121 ఏ, 287, 336, 337, 338 కింద చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరించారు. రోడ్ షో సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రోడ్లలో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.



More Telugu News