ఏపీలో కూటమిదే గెలుపు అని ఇండియాటుడే, ఏబీపీ, న్యూస్18 సర్వేలు తేల్చేశాయి: నారా లోకేశ్

  • ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 18 స్థానాలు గెలుస్తుందన్న న్యూస్18
  • ప్రజలు కూటమినే నమ్ముతున్నారన్న లోకేశ్
  • ప్రజల నమ్మకాన్నే జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడి
  • "హలో... వై నాట్ 175 జగన్... ఛలో లండన్" అంటూ వ్యంగ్యం
ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉండగా... బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి 18 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని జాతీయ మీడియా సంస్థ న్యూస్18 సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో 22 స్థానాలు గెలిచిన వైసీపీ ఈసారి 7 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 

ఏపీలో మూడు పార్టీల కూటమిదే విజయం అని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. ఇండియాటుడే, ఏబీపీ, న్యూస్18 సర్వేలు కూటమిదే గెలుపు అని తేల్చేశాయని పేర్కొన్నారు. సైకో జగన్ చేతిలో రాష్ట్రం నాశనమైందని, కూటమితోనే ఏపీ పునర్ నిర్మాణం సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని లోకేశ్ స్పష్టం చేశారు. కూటమిపై ప్రజల నమ్మకాన్ని జాతీయ సర్వేలు ప్రతిబింబిస్తున్నాయని వివరించారు. 

ఏపీలోని ఎంపీ స్థానాల్లో 17 వరకు టీడీపీ గెలుచుకుంటుందని ఇండియా టుడే చెప్పిందని... ఏపీలో 20 ఎంపీ స్థానాల్లో కూటమిదే విజయం అని ఏబీపీ సర్వే చెప్పిందని లోకేశ్ గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీలో 18 స్థానాల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలదే విజయం అని న్యూస్18 సర్వే చెప్పిందని వెల్లడించారు. 

ఈసారి ఎన్నికల్లో ఎదురయ్యే దారుణ పరాజయం నుంచి జగన్ గ్యాంగ్ తప్పించుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక తుపానులో వైసీపీకి అంతిమయాత్ర ఖాయమని తెలిపారు. వైసీపీ జెండాను శాశ్వతంగా పాతిపెట్టే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. "హలో... వై నాట్ 175 జగన్... ఛలో లండన్" అంటూ లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు.


More Telugu News