18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం

  • 19 వెబ్‌సైట్‌లను కూడా బ్లాక్ చేసినట్టుగా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ప్రకటన
  • 57 సోషల్ మీడియా ఖాతాలపైనా వేటు
  • అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను పబ్లిష్ చేయడమే కారణమని వెల్లడి
అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌, 19 వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వ వేటువేసింది. నిషేధం విధిస్తున్నట్టుగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. వీటితో పాటు మరో 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేస్తున్నట్టు వివరించింది. ఆయా ప్లాట్‌ఫామ్స్ అసభ్యకరమైన కంటెంట్‌తో పాటు కొన్ని సందర్భాల్లో పోర్నోగ్రఫీ కంటెంట్‌ను కూడా పబ్లిష్ చేస్తున్నాయని పేర్కొంది. ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వెబ్‌సైట్‌లపై పోస్ట్ చేస్తున్న కంటెంట్ అసభ్యకరంగా, అశ్లీలంగా,  స్త్రీలను అవమానపరిచే విధంగా ఉందని గుర్తించామని వెల్లడించింది. ఉపాధ్యాయులు-విద్యార్థుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అసభ్యకర సంబంధాలను చూపించే కంటెంట్‌ను చిత్రీకరిస్తున్నారని, బూతులు ఎక్కువగా ఉన్నాయని గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు మంత్రిత్వశాఖలు, విభాగాలు, మీడియా, వినోదరంగం, మహిళలు-పిల్లల హక్కులకు సంబంధించిన నిపుణులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని సమాచార మంత్రిత్వశాఖ వివరించింది. సమాచార సాంకేతిక చట్టం-2000లోని నిబంధనల కింద నిషేధం విధించినట్టు తెలిపింది.

నిషేధం వేటు పడిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇవే..
డ్రీమ్స్ ఫిల్మ్స్, వూవీ, యస్మా, అన్‌కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియోన్ ఎక్స్ వీఐపీ, బెషరమ్స్, హంటర్స్, రాబిట్, ఎక్స్‌ట్రామూడ్, నూప్లిక్స్, మూడ్ ఎక్స్, మోజ్‌ప్లిక్స్, హాట్ షాట్స్ వీఐపీ, ఫుగి, చికూఫ్లిక్స్, ప్రైమ్ ప్లే నిషేధం పడిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జాబితాలో ఉన్నాయి.


More Telugu News