ఇంకెవడూ బతకకూడదు... మా గుంపే బతకాలంటే కుదరదు... తొక్కేస్తాం: పవన్ కల్యాణ్

  • జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ ప్రసంగం
  • తాను రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసం అని స్పష్టీకరణ
  • ఓడిపోయాక శూన్యంగా అనిపించిందని వెల్లడి
  • జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని వివరణ
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదని, మార్పు కోసం అని స్పష్టం చేశారు. ఒక ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, అయితే ఓడిపోయాక శూన్యంగా అనిపించిందని అన్నారు. 

గతంలో తాను కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించానని, సామాన్యుడికి అండగా నిలవాలన్నదే అప్పుడూ, ఇప్పుడూ తన అజెండా అని పవన్ కల్యాణ్ వివరించారు. నాడు కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపనలో అండగా నిలిచిన వ్యక్తులే ఇవాళ జనసేనకు మూలస్తంభాలయ్యారని వెల్లడించారు. జనసేన పార్టీని 150 మందితో ప్రారంభించామని, నేడు 6.50 లక్షల మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి పార్టీ ఎదిగిందని తెలిపారు. 

విధానపరంగానే విభేదిస్తాను తప్ప... వైసీపీ పై కానీ, జగన్ పై కానీ తనకు వ్యక్తిగత ద్వేషమేమీ లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. మేం తప్ప ఇంకెవడూ బతకకూడదు... మా గుంపే ఎదగాలి అంటే కుదరదు అని స్పష్టం చేశారు. మీరు మమ్మల్ని తొక్కేస్తామంటే మేమూ మిమ్మల్ని తొక్కేస్తాం అని హెచ్చరించారు. 

"నేను ప్రపంచమంతటికీ తెలిసిన పాప్యులర్ నటుడ్నే కావొచ్చు... కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఆ పాప్యులారిటీ అధికారంలోకి బదిలీ కాదు... అందుకే నేను పాతికేళ్లు పనిచేయాలన్న లక్ష్యంతో వచ్చాను. అయితే అభిమానులు మాట పడరు. నేను మోదీ గారికి నమస్కారం చేస్తే... నువ్వు ఆయనకెందుకు నమస్కారం చేశావంటారు. మోదీ మహానాయకుడు. 

ఒక్కోసారి అభిమానం మనల్ని ఎదగనివ్వదు. వైసీపీ నేతలు నిన్ను తిడుతున్నారు... ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి అంటారు. నేను మీ కోసం రాజకీయాల్లోకి రాలేదు... ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లికోసం వచ్చాను. నా నేల ఇది, నా దేశం ఇది, నా సమాజం ఇది. మా ఇంట్లో వాళ్లు ఎందుకు పాలిటిక్స్? అన్నారు. నేనేమీ చేయకపోయినా దాడులు చేస్తుంటే ఏం చేయాలి? అని వారిని ప్రశ్నించాను. 

ఓ దశలో సినిమాలు చేసుకుందాం అనుకున్నాను. కానీ, పనిగట్టుకుని మరీ అత్తారింటికి దారేది సినిమాను ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. అప్పుడే మా వాళ్లకు చెప్పాను... నన్ను ప్రశాంతంగా బతకనివ్వరు అని. నా ఎదుగుదలే నాకు శాపమైపోయింది, మీ గుండెల్లో ఉన్న అభిమానమే నాకు శాపమైపోయింది. 

2014 నుంచి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతున్నాం. జనసేన ఇప్పుడు గుర్తింపు ఉన్న పార్టీగా ఎదిగింది. 18 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి మనకు. మనకు 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉండుంటే జనసేన స్థాయి మరోలా ఉండేది. కానీ ఆ రోజున నా వ్యూహాలు ఎవరూ అమలు చేయనివ్వలేదు. నేను వెళితే లక్షలాది మంది జనం వస్తారు కానీ ఆ లక్షలాది మంది ప్రజలు లక్షలాది ఓటర్లు కారు. వారందరూ ఓట్లు వేస్తే పరిస్థితి వేరేగా ఉండేది.

ఓ వ్యక్తిగా నేను ఏంటి? ఓ రాజకీయ నాయకుడిగా నేను ఏంటి? అనేది నాపై నాకు చాలా అవగాహన ఉంది. నా వ్యూహం నాకుంది... నన్ను స్వేచ్ఛగా వదిలేయండి అని ఎందుకు చెబుతానంటే... నేనేంటో నాకు తెలుసు... నాలో నాకు అరమరికలు ఉండవు... నన్ను నేను బ్లాక్ అండ్ వైట్ లో చూస్తాను. కానీ నన్ను మరో స్థాయిలో చూడాలనుకునే వారు నేను ఎవరి దగ్గరా తగ్గడాన్ని భరించలేరు. కానీ తగ్గడం చాలా అవసరం. పరిస్థితులు అనుకూలించనప్పుడు తగ్గి ఉండడంలో తప్పులేదు. 

2019లో 30 స్థానాల్లో పోటీ చేద్దామనుకున్నాను. కానీ అందరూ ఒత్తిడి చేయడంతో నిస్సహాయ పరిస్థితుల్లో రాష్ట్రమంతా పోటీ చేయాల్సి వచ్చింది. దారుణం ఏంటంటే... ఆ సమయంలో నేను ఓడిపోతున్నానన్న సంగతి కూడా నాకు తెలుసు. ఒకసారి యుద్ధంలోకి దిగాక ఓటమి, గెలుపు గురించి ఆలోచించకుండా యుద్ధమే చేయాలి. గాజువాకలో ఎలాగూ ఓడిపోతానని తెలుసు... ప్రచారం ముగించగానే అర్థమైంది భీమవరంలో కూడా ఓడిపోతున్నానని. 

రెండు చోట్ల ఓడిపోయినవాడికి దేశం మీద, సమాజం మీద ఇంత పిచ్చి మంచిదా? అనిపించింది. కానీ నాకు భగవంతుడు ఒకటే చెప్పాడు... అది నీ బాధ్యత కాబట్టి నిర్వర్తించు అన్నాడు. కర్మయోగిలా పనిచేసుకుంటూ వెళ్లు... ఫలితం కోసం చూడకు అనే సూత్రాన్ని పాటిస్తాను. 

ఓ దశలో పార్టీ ఎలా నడపాలో నాకు తెలియలేదు. డబ్బులు ఎక్కడ్నించి వస్తాయి అనుకున్నాను. అలాంటి సమయంలో నా వెన్నంటే ఉన్న మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సమాజం కోసం ఆలోచిస్తే నాకోసం ఆలోచించేవాడు ఒకడుండాలి కదా. నాకోసం వకీల్ సాబ్, తదితర సినిమాల్లో త్రివిక్రమ్ పాలుపంచుకున్నారు" అంటూ పవన్ కల్యాణ్ వివరించారు.


More Telugu News