పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ.. స్వయంగా ప్రకటించిన జనసేనాని

  • ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని వెల్లడి
  • రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు తెర
  • గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్‌కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆయన గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన స్పష్టతనిచ్చారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్ అధికారికంగా ప్రకటించారు.

 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి చేయమని అడిగారని ఆయన వెల్లడించారు. తెలంగాణ నుంచి, పిఠాపురం నుంచి పోటీ చేయమంటూ తనకు వినతులు వచ్చాయని అన్నారు. అయితే రాష్ట్రం కోసం ఆలోచించి అప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని అన్నారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్‌ను అక్కడి నుంచి ప్రారంభించానని అన్నారు. కాగా గత ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి, రెండు చోట్లా పరాజయం పాలైన విషయం తెలిసిందే.


More Telugu News