బీఆర్ఎస్ ప్రయత్నాలు విఫలం.. గంటల వ్యవధిలోనే మారిన సీన్.. మరికాసేపట్లో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్

బీఆర్ఎస్ ప్రయత్నాలు విఫలం.. గంటల వ్యవధిలోనే మారిన సీన్.. మరికాసేపట్లో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
  • రమేశ్ వ్యవహారంలో నిన్నంతా హైడ్రామా
  • రాజీనామా ప్రకటించడానికి ముందు బలవంతంగా హైదరాబాద్‌కు తరలించిన బీఆర్ఎస్ నేతలు
  • కేసీఆర్‌తో సమావేశం అనంతరం బీఆర్ఎస్‌లోనే ఉన్నట్టు ప్రకటన
  • రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఈ ఉదయం ఢిల్లీలో వాలిపోయిన నేత
బీఆర్ఎస్ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అధిష్ఠానానికి భారీ షాక్ ఇచ్చారు. ఆయన నిన్న బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. వరంగల్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తన రాజీనామాను ప్రకటించడానికి ముందు బీఆర్ఎస్ నేతలు అడ్డుకుని ఆయనను బలవంతంగా హైదరాబాద్‌లో నందినగర్‌లోని అధినేత కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చారు. ఆయనతో సమావేశం అనంతరం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ప్రకటించి ఊహాగానాలకు తెరదించారు. ఈ హైడ్రామా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని కేసీఆర్ సమక్షంలో ప్రకటించిన ఆరూరి.. గంటలు కూడా గడవకముందే పార్టీకి కోలుకోలేని షాకిచ్చారు. బీజేపీలో చేరేందుకు ఈ ఉదయం ఆయన ఢిల్లీ బయలుదేరారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి హస్తినలో కాలుమోపారు. మరికాసేపట్లో బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.


More Telugu News