భార్యతో గొడవ.. ప్రియురాలి ఇంటికి వెళ్లి భర్త ఆత్మహత్య!

  • యాదాద్రి జిల్లాలో ఘటన
  • భర్త ఆత్మహత్యపై భార్య అనుమానం
  • భార్య ఫిర్యాదుతో కేసు నమోదు
మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు.. ఆ కోపంతో ప్రియురాలి ఇంటికి వెళ్లిన భర్త తెల్లారేసరికి శవంగా మారాడు. ఆత్మహత్య చేసుకున్నాడని ప్రియురాలు చెబుతుండగా.. భర్త మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలో చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాఘవాపురం గ్రామానికి చెందిన రక్తని స్వామి మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో భార్య భవితతో గొడవ పడ్డాడు. భార్య మీద కోపంతో అవుషాపూర్ లోని ప్రియురాలు దీపిక ఇంటికి వెళ్లాడు. దీపిక భర్త లేకపోవడంతో రాత్రంతా అక్కడే ఉన్నాడు. తెల్లవారేసరికి వంటగదిలో స్వామి ఉరి వేసుకుని కనిపించడంతో దీపిక ఆందోళన చెందింది. వెంటనే ఇబ్రహీంపట్నంలో ఉంటున్న తన భర్త ముఖేశ్ కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో హుటాహుటిన అవుషాపూర్ వచ్చిన ముఖేశ్.. పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వామి మృతదేహాన్ని పరిశీలించారు. వంట గదిలో ఉరి వేసుకున్న తీరును పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి భవిత కూడా ముఖేశ్ ఇంటికి చేరుకుంది. స్వామి ఆత్మహత్య చేసుకున్నాడని దీపిక, ముఖేశ్ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని, తన భర్త మరణంపై పోలీసుల వద్ద సందేహాలు వ్యక్తం చేసింది. భవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్వామి మృతిపై విచారణ జరుపుతున్నారు.


More Telugu News