మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటాలంటూ పిల్.. కొట్టేసిన హైకోర్టు!

  • ఏపీ, టీఎస్ మధ్య ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియ పూర్తి కాలేదన్న పిటిషనర్
  • ఉమ్మడి చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేయాలని విన్నపం
  • పార్లమెంటును తాము ఎలా ఆదేశించగలమని ప్రశ్న
మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేలా చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఉమ్మడి రాజధానిపై చట్టం చేయాలని పార్లమెంటును తాము ఎలా ఆదేశించగలమని ప్రశ్నించింది. పార్లమెంటును ఆదేశించడం పిల్ వేసినంత ఈజీ కాదని చెప్పారు. తమకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని తెలిపింది. 

రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని అనేక అంశాల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని... ఈ నేపథ్యంలో, హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం విచారించింది. 

వాదనల సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... ఈ ఏడాది జూన్ 2తో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కు పదేళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశంపై పార్లమెంటును తాము ఎలా ఆదేశించగలమన్న ధర్మాసనం... పిల్ ను కొట్టివేసింది.


More Telugu News