రాజోలు అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తే కచ్చితంగా గెలుస్తా: రాపాక వరప్రసాదరావు

  • రాజోలు అసెంబ్లీ స్థానాన్ని గొల్లపల్లి సూర్యారావుకు కేటాయించిన వైసీపీ
  • రాపాకను అమలాపురం పార్లమెంటు స్థానం అభ్యర్థిగా ప్రకటించిన వైనం
  • తనకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారన్న రాపాక
  • అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని వ్యాఖ్య
వైసీపీ అధిష్ఠానం తనకు అమలాపురం ఎంపీ టిక్కెట్టు ఇవ్వడంపై కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారని పార్టీ నేత రాపాక వరప్రసాద్ తెలిపారు. తాను రాజోలులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజోలు టిక్కెట్టు దక్కించుకున్న గొల్లపల్లి సూర్యారావుకు గెలుపు అంత సులభం కాదని కూడా అభిప్రాయపడ్డారు. 

‘‘ఈ నాలుగు సంవత్సరాలు కార్యకర్తలు నా వెంటే ఉన్నారు. కలిసిమెలిసి అనేక కార్యక్రమాలు చేశాం. కాబట్టి.. మా మధ్య అనుబంధం ఉంటుంది. మన నాయకుడు రాపాకే అన్న అభిప్రాయం వాళ్లకు ఉంది. అధిష్ఠానం మాత్రం వేరే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని మనం కాదనలేం. జగన్ మోహన్ రెడ్డి ఏ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారో నాకైతే తెలీదు కానీ కార్యకర్తలు మాత్రం నిరుత్సాహంగా ఉన్నారు. ఆశించింది జరక్కపోతే నిరుత్సాహం సహజమే. కానీ, జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందే’’ అని అన్నారు.

తాను ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చన్న ఉద్దేశంతోనే గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టు చెప్పారు. అధిష్ఠానం నిర్ణయం తరువాత ఇక చేసేదేం లేదని, తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజోలులో గెలుపునకు కచ్చితంగా తామంతా కృషి చేస్తామన్నారు.


More Telugu News