టిక్ టాక్ పై నిషేధం... బిల్లుకు ఆమోదం తెలిపిన అమెరికా చట్టసభ

  • అమెరికాలో టిక్ టాక్ పై నిషేధం
  • ఆస్తులు అమ్ముకునేందుకు ఆరు నెలల గడువు
  • బిల్లుకు అనుకూలంగా 352 మంది సభ్యుల మద్దతు
చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం విధించేందుకు తీసుకువచ్చిన బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది. అమెరికాలో సదరు యాప్ కు ఉన్న ఆస్తులు అమ్ముకునేందుకు, లేక నిషేధం ఎదుర్కోవడానికి ఆరు నెలలు గడువు ఇచ్చే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 352 మంది ఓట్ చేయగా, 65 మంది వ్యతిరేకించారు. అధికార డెమొక్రటిక్ పార్టీ సభ్యులతో పాటు విపక్ష రిపబ్లికన్లు కూడా మద్దతు పలికారు. 

అయితే, ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించినా, సెనేట్ లో మాత్రం అనిశ్చితి నెలకొంది. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే విదేశీ యాప్ ల నియంత్రణకు భిన్న పంథా అనుసరించాలని కొందరు సెనేటర్లు భావిస్తున్నారు. 

ఆసక్తికర అంశం ఏమిటంటే... అమెరికాలో టిక్ టాక్ పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీలకు యువత నుంచి అత్యధిక సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు కృషి చేయాలంటూ వస్తున్న ఫోన్ కాల్స్ కంటే, టిక్ టాక్ విషయంలోనే అత్యధిక కాల్స్ వస్తున్నట్టు గుర్తించారు. 

టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ కు చైనా అధికార పక్షం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని అమెరికా అనుమానిస్తోంది. టిక్ టాక్ పై భారత్ ఎప్పుడో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.


More Telugu News