సోదరుడితో అన్ని బంధాలు తెంచుకున్నాను... ఆయనకు నచ్చినట్లు చేసుకోనివ్వండి: మమతా బెనర్జీ

  • టీఎంసీ అభ్యర్థుల జాబితాపై అసహనం వ్యక్తం చేసిన మమత సోదరుడు బాబూల్ 
  • ఎన్నికల సమయంలో ఏదో ఒక సమస్య సృష్టిస్తారని ఆరోపణ
  • అత్యాశపరులు అంటే తనకు ఇష్టం ఉండదన్న మమతా బెనర్జీ
  • ఆయన బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిసిందని వ్యాఖ్య
తన సోదరుడు బాబూల్ బెనర్జీతో అన్ని బంధాలను తెంచుకున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టీఎంసీ అభ్యర్థుల జాబితాపై బాబూల్ అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. దీంతో ఆయనపై అధినేత్రి మండిపడ్డారు. తన కుటుంబం, తాను అతడితో అన్ని బంధాలను తెంచుకున్నామని తెలిపారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో ఏదో ఒక సమస్యను సృష్టిస్తారని, అత్యాశపరులు అంటే తనకు ఇష్టం ఉండదన్నారు. తాను కుటుంబ రాజకీయాలను విశ్వసించనని స్పష్టం చేశారు.

పార్టీ అభ్యర్థుల జాబితాపై బాబుల్ చేసిన వ్యాఖ్యలను తాను విన్నానని... ఆయన బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిసిందని పేర్కొన్నారు. ఆయనకు నచ్చినట్లు చేసుకోనివ్వండి... ఆయనతో మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. హౌరా లోక్ సభ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీకి ఇవ్వడం పట్ల బాబుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, కేంద్రం తీసుకువచ్చిన సీఏఏపై కూడా మమతా బెనర్జీ స్పందించారు. తాము దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు. అసోం మాదిరి బెంగాల్లో శరణార్థి శిబిరాలను తాము కోరుకోవడం లేదన్నారు.


More Telugu News