కాలిఫోర్నియా గాళ్స్... ఈ దొంగల ముఠాలో అందరూ మహిళలే!

  • అమెరికాలో మేకప్ సామగ్రి చోరీ చేస్తున్న మహిళల ముఠా
  • రూ.66 కోట్ల విలువైన మేకప్ సామగ్రి చోరీ
  • ఓ ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా చోరీ సొత్తు అమ్మకం
అమెరికాలో ఓ దొంగల ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా పేరు కాలిఫోర్నియా గాళ్స్. పేరుకు తగ్గట్టే ఈ ముఠాలో అందరూ ఆడవాళ్లే సభ్యులు. 12 మంది మహిళలు సభ్యులుగా ఉన్న కాలిఫోర్నియా గాళ్స్ ముఠాకు మిషెల్ మాక్ (53) అనే నడి వయసు మహిళ నాయకురాలిగా వ్యవహరిస్తోంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన మిషెల్ మాక్ ఇప్పటివరకు తన ముఠా సాయంతో రూ.66 కోట్ల విలువైన సొత్తును చోరీ చేసింది. 

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే... కాలిఫోర్నియా గాళ్స్ ముఠా మేకప్ సామగ్రిని మాత్రమే దొంగిలిస్తుంది. ఏ స్టోర్ లో దొంగతనం చేయాలో మిషెల్ మాక్ స్వయంగా రెక్కీ చేస్తుంది. ముఠాలోని మిగతా సభ్యులు ఆమె సూచించిన స్టోర్ కు వెళ్లి తమ హస్తలాఘవం ప్రదర్శిస్తారు. బాగా పేరున్న బ్రాండ్ల మేకప్ ఉపకరణాలనే వీరు టార్గెట్ చేసేవారు. 

ఈ విధంగా ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో చోరీలు చేశారు. చోరీలకు ఈ ముఠా సభ్యులు కార్లు, విమానాల్లో వెళ్లేవారు. ఖర్చులన్నీ ముఠా నాయకురాలు మిషెల్ మాక్ భరించేది. 

ఇక, చోరీ చేసిన సొత్తును ఏదో దొంగచాటుగా అమ్ముతారనుకుంటే పొరబడినట్టే. తాము కొట్టుకొచ్చిన మేకప్ సామగ్రిని ఓ ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ లో దర్జాగా విక్రయించేవారు. పైగా, డిస్కౌంట్లు కూడా ప్రకటించి కస్టమర్లను ఆకర్షించేవారు. 

పోలీసుల ఈ ముఠా స్థావరంపై దాడులు చేయగా భారీ మొత్తంలో మేకప్ సామగ్రి లభ్యమైంది. ఆ భవనం ఎంత విలాసవంతంగా ఉందో చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవలే కాలిఫోర్నియా పోలీసులు మిషెల్ మాక్ ను అరెస్ట్ చేయడంతో ఈ ముఠా గుట్టురట్టయింది.


More Telugu News