ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు షాక్‌.. ఐపీఎల్ సీజ‌న్ మొత్తానికి స్టార్ ఆట‌గాడు దూరం!

  • మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ సీజ‌న్ ప్రారంభం
  • రూ.4కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్ సీజ‌న్‌కు దూరం
  • బ్రూక్‌ స్థానంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ సంచ‌ల‌నం జేక్ ఫ్రేజ‌ర్ కోసం ఢిల్లీ ప్ర‌య‌త్నాలు
  • ఆస్ట్రేలియ‌న్ దేశ‌వాళీ క్రికెట్‌లో 29 బంతుల్లోనే శ‌త‌కం న‌మోదు చేసిన యువ ఆట‌గాడు
మ‌రో ఎనిమిది రోజుల్లో (మార్చి 22) ఐపీఎల్ 17వ సీజ‌న్ ప్రారంభం కానుంది. అయితే, సీజ‌న్ ప్రారంభానికి ముందే తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఇంగ్లండ్ ఆట‌గాడు హ్యారీ బ్రూక్ ఈ సీజ‌న్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల నేప‌థ్యంలో తాను ఆడ‌లేన‌ని ఢిల్లీ యాజ‌మాన్యానికి స‌మాచారం అందించిన‌ట్లు తెలిసింది. ఇక ఇటీవ‌ల భార‌త్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లోనూ అత‌డు చివ‌రి నిమిషంలో ఇంగ్లండ్‌ జ‌ట్టు నుంచి త‌ప్పుకున్నాడు. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన మినీ వేలంలో బ్రూక్‌ను ఢిల్లీ జ‌ట్టు రూ.4 కోట్ల‌కు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.

ఇక హ్యారీ బ్రూక్ త‌ప్పుకోవ‌డంతో అత‌ని స్థానంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ సంచ‌ల‌నం జేక్ ఫ్రేజ‌ర్ మెగుర్క్‌ను తీసుకోవాల‌ని అనుకుంటోంది. 21 ఏళ్ల ఈ యువ ఆట‌గాడు గ‌త నెల‌లో విండీస్‌పై ఆస్ట్రేలియా త‌రఫున వ‌న్డేల్లో అరంగేట్రం చేశాడు. త‌న రెండో వ‌న్డేలోనే సెన్సేష‌న‌ల్ బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు కేవ‌లం 18 బంతుల్లోనే ఏకంగా 41 ప‌రుగులు బాదాడు. ఈ తుపాన్ లాంటి ఇన్నింగ్స్‌లో 5 బౌండ‌రీలు, 3 సిక్స‌ర్లు ఉండ‌డం విశేషం. 

అంత‌కుముందు కూడా జేక్ ఫ్రేజ‌ర్ ఆస్ట్రేలియ‌న్ దేశ‌వాళీ క్రికెట్‌లో సంచ‌ల‌న బ్యాటింగ్‌తో వార్త‌ల్లో నిలిచాడు. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో ద‌క్షిణ ఆస్ట్రేలియా త‌ర‌ఫున దేశ‌వాళీ వ‌న్డే మ్యాచ్ ఆడిన ఈ యువ ఆట‌గాడు కేవ‌లం 29 బంతుల్లోనే శ‌త‌కం న‌మోదు చేశాడు. 

కాగా, జేక్ ఫ్రేజ‌ర్ 2023 డిసెంబ‌ర్‌లో దుబాయిలో జ‌రిగిన మినీ వేలంలో త‌న పేరు కూడా ఇచ్చాడు. కానీ, ఏ ఫ్రాంచైజీ కూడా అత‌డిని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపించ‌లేదు. ఇప్పుడు హ్యారీ బ్రూక్ స్థానంలో మ‌నోడికి ఐపీఎల్ ఆడే అవ‌కాశం వ‌స్తోంది. ఇక్క‌డ కూడా రాణిస్తే ఈ యువ కెర‌టానికి వెనుతిరిగి చూసుకోవాల్సి అవ‌స‌రం ఉండ‌దు.


More Telugu News