జమ్మికుంట తహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు

  • ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రెయిడ్
  • హనుమకొండలోని బంధువుల నివాసంలోనూ తనిఖీ
  • పట్టుబడ్డ నగదు, ఆస్తుల వివరాలు వెల్లడించని అధికారులు
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో జమ్మికుంట తహసీల్దార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెయిడ్ చేశారు. జమ్మికుంటలోని తహసీల్దార్ రజని నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి తనిఖీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రజనీ నివాసంతో పాటు హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఆమె బంధువుల నివాసంలోనూ ఏకకాలంలో తనిఖీ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

అయితే, ఇప్పటి వరకు ఎంత నగదు బయటపడింది, రజని ఎన్ని ఆస్తులు కూడబెట్టారు? అనే వివరాలను ఏసీబీ అధికారులు బయటపెట్టలేదు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడే వివరాలు వెల్లడించలేమని చెప్పినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి మంగళవారం ఉదయం జమ్మికుంటలోని రజనీ నివాసానికి, హనుమకొండలోని ఆమె బంధువుల ఇంటికి ఏకకాలంలో చేరుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.



More Telugu News